తన గెలుపుని చంద్రబాబు, లోకేష్ లకు అంకితం చేసిన పంచుమర్తి అనురాధ

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ వైస్సార్సీపీ కి భారీ షాక్ ఇచ్చింది టీడీపీ. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ 23 ఓట్లతో విజయం సాధించారు. కేవలం 19 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉన్న టీడీపీకి… 23 మంది ఎమ్మెల్యేల ఓట్లు పడ్డాయి. దీని బట్టి చూస్తే అధికార పార్టీ నుండి నలుగురు ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ పడినట్లు స్పష్టంగా అర్ధమవుతుంది. ప్రస్తుతం విజయానందంలో టీడీపీ ఉంటె..అంతర్మధనం లో వైస్సార్సీపీ ఉంది.

ఇక ఎన్నికల్లో విజయం సాధించిన పంచుమర్తి అనురాధ..తన విజయాన్ని చంద్రబాబు, లోకేష్ లకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. తనకు అవకాశం కల్పించిన చంద్రబాబు, లోకేశ్ లకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

ఇక వైస్సార్సీపీ తరపున బొమ్మి ఇజ్రాయెల్ (22 ఓట్లు), ఏసురత్నం (22), పోతుల సునీత (22), సూర్యనారాయణరాజు (22), మర్రి రాజశేఖర్ (22) గెలుపొందారు. వైస్సార్సీపీ ఇతర అభ్యర్థులు జయమంగళ వెంకటరమణ, కోలా గురువులుకు 21 ఓట్లు చొప్పున రావడంతో… రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. ఈ క్రమంలో వెంకటరమణ అంతిమ విజయం సాధించారు. వెంకటరమణ ఇటీవలే టీడీపీని వీడి వైస్సార్సీపీలో చేరారు.