బ‌ద్వేలు ఉప ఎన్నిక బరిలో బీజేపీ అభ్యర్థిగా ప‌న‌త‌ల సురేశ్

బ‌ద్వేలు ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థి గా బిజెపి పార్టీ ప‌న‌త‌ల సురేశ్ ను అధికారికంగా ప్రకటించింది. నిన్నటి వరకు అసలు బిజెపి పోటీ చేస్తుందో చేయదో అని కొంతమంది…లేదు లేదు పోటీ చేస్తుంది..వీరి పోటీలో ఉన్న అభ్యర్ధులని రకరకాల పేర్లు ప్రచారం జరిగింది. కానీ చివరికి సంఘ్ మూలాలున్న యువ దళిత నేతవైపే పార్టీ మొగ్గు చూపింది. కడప జిల్లాకే చెందిన పనతల సురేశ్ తొలి నుంచీ సంఘ్ సంబంధిత సంస్థల్లోనే పనిచేస్తున్నారు.

ఏబీవీపీ కార్యకర్తగా మొదలై, బీజేపీవైఎంకు జాతీయ స్థాయిలోనూ నాయకత్వం వహించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పనతల సురేశ్ ఇదే జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిపోయారు. ఇక ఇప్పుడు బద్వేల్ ఉప ఎన్నిక నేపథ్యంలో బ‌రిలో నిలిచే త‌మ పార్టీ అభ్య‌ర్థి సురేష్ అని బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు ప్ర‌క‌టించారు.

‘వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా, కుటుంబ పాలనకు దూరంగా, ప్రజాసంక్షేమమే ధ్యేయంగా బద్వేల్ అసెంబ్లీ ఉపఎన్నిక బరిలో నిలుస్తోంది బీజేపీ. 14 సంవ‌త్స‌రాలు విద్యార్థి నాయకుడిగా, గత 5 సంవ‌త్స‌రాలుగా యువనాయకుడిగా ప్రజా సమస్యల సాధనకు అనేక పోరాటాలు సాగించిన సురేశ్ ప‌న‌తల గారిని బీజేపీ తన అభ్యర్థిగా ప్రకటించింది’ అని సోము వీర్రాజు ట్వీట్ చేశారు.

‘బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు మీ అమూల్యమైన ఓటును కమలం గుర్తుపై వేసి, మీ సమస్యల సాధనకై గల్లీ నుండి ఢిల్లీ వరకు పోరాటం చేయగల ఒక యువనాయకుడిని గెలిపించుకోవాలని కోరుతున్నాను’ అని సోము వీర్రాజు పేర్కొన్నారు.

వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అకాల మరణంతో బద్వేల్ ఉప ఎన్నిక అనివార్యం కాగా, చనిపోయిన ఎమ్మెల్యే భార్యనే వైసీపీ అభ్య‌ర్థిగా నిలబెట్టింది. గ‌త సంప్ర‌దాయాల‌ను గౌర‌విస్తూ జ‌న‌సేన‌, టీడీపీలు ఈ ఎన్నిక‌ల్లో పోటీకి దూరంగా ఉంటున్నాయి. కానీ, బీజేపీ మాత్రం పోటీకి దిగుతుంది.