పల్లీ లడ్డు

రుచి: వెరైటీ వంటకాలు

Palli Laddu
Palli Laddu

కావాల్సినవి :

పల్లీలు-కప్పు, నువ్వులు-అరకప్పు, బెల్లంపొడి- ముప్పావు కప్పు, యాలకుల పొడి కొద్దిగా…

తయారు చేయువిధానం :

పల్లీలను నూనె లేకుండా వేయించి చల్లార్చి పక్కన పెట్టుకోవాలి. నువ్వులను కూడా అలాగే చేయాలి. ఇప్పుడు పల్లీలు, నువ్వులు, బెల్లంపొడి, యాలకుల పొడి వేసి మిక్సీలో మెత్తగా పొడి చేసుకోవాలి.
పల్లీలు, నువ్వుల్లో ఉండే నూనె మూలంగా ఈ మిశ్రమం పొడిపొడిగా కాకుండా
దగ్గరగా వస్తుంది. కాబట్టి సులభంగా లడ్డూలను చుట్టుకోవచ్చు.

ఉపయోగాలు :

పల్లీల్లో ప్రోటీన్లు, ఫైబర్‌, పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. నువ్వుల్లో జింక్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సెలీనియం, కాపర్‌, ఐరన్‌, విటమిన్‌-సితోపాటు క్యాల్షియం కూడా చాలా ఎక్కువ. ఇది ఎముకల బలానికి, శక్తికి ఎంతో ఉపయోగపడుతుంది. పిల్లలకు స్వీట్లు, కూల్‌డ్రింక్‌లు, చిప్స్‌ ఇవ్వకుండా వీటిని ఇవ్వడంవల్ల ఆరోగ్యంగా ఎదుగుతారు.

బయట దొరికే ఆహార పదార్థాల్లో, ఉండే అధిక చక్కెరవల్ల ఊబకాయం పెరిగే అవకాశం ఉంది. పైగా ఏకాగ్రత కూడా తగ్గుతుంది. సాధ్యమైనంత వరకు ఇలాంటి వాటికి దూరంగా ఉంచాలి. ఈ లడ్డూ తయారీకి తక్కువ సమయం పడుతుంది. శక్తిమాత్రం ఎక్కువగా అందుతుంది.

నువ్వులు, పల్లీలు రెండూ కలిపి ఉండలు చేయొచ్చు. లేదా వేర్వేరుగా తయారు చేసుకోవచ్చు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి పిల్లలు ఇంటి వద్ద ఉన్నారు కాబట్టి పిల్లలతో కూడా
ఈ లడ్డూలను తయారు చేయించవచ్చు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/