మసూద్ అజర్‌‌ను అరెస్ట్ చేయండి.. ఆఫ్ఘనిస్తాన్‌కు పాకిస్తాన్ లేఖ

మసూద్ ఆఫ్ఘనిస్థాన్ లోని నంగర్ హర్, కన్హర్ ప్రాంతాల్లో ఉన్నారంటున్న పాక్ మీడియా

Masood Azhar
Masood Azhar

ఇస్లామాబాద్: ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ అధినేత మసూద్ అజర్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆఫ్ఘనిస్తాన్‌కు పాకిస్తాన్ లేఖ రాసింది. మసూద్ అజార్ ఆఫ్ఘన్ ప్రావిన్స్‌లోని నంగర్‌హర్, కున్హర్‌లలో ఉండే అవకాశం ఉందని లేఖలో స్పష్టంగా పేర్కొంది. జైషే చీఫ్‌ని కనిపెట్టి అరెస్ట్ చేయాలని.. ఆ తర్వాత పాక్ అధికారులకు సమాచారం ఇవ్వాలని లేఖలో పేర్కొంది. మసూద్‌ అజార్‌ను అరెస్ట్‌ చేయాలంటూ పాక్‌ విదేశాంగ శాఖ లేఖ రాయడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ అంశంపై అఫ్ఘనిస్తాన్ ఇంతవరకు స్పందించలేదు. అయితే ఉగ్రవాదులపై చర్య తీసుకోవాలంటూ ఎఫ్ఏటీఎఫ్ ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్ ఈ లేఖ రాసినట్టు పాక్ మీడియా సంస్థ బోల్ న్యూస్ తెలిపింది. గ్రే లిస్ట్ నుంచి బయటపడేందుకు ఈ లేఖ రాసినట్టు పేర్కొంది. మరోవైపు లష్కరే తోయిబా ఆపరేషనల్ కమాండర్ సాజిద్ మీర్ పై పాక్ ఇటీవలే చర్యలు తీసుకుంది.

కాగా, మసూద్‌ అజార్‌ను ప్రపంచ ఉగ్రవాదుల జాబితాలో 2019 మే 1న ఐక్యరాజ్యసమితి చేర్చింది. 2008లో భారత పార్లమెంట్‌పై దాడి జరిగిన తర్వాత అమెరికా జెఎమ్‌ని విదేశీ ఉగ్రవాద సంస్థ జాబితాలో చేర్చింది. జెఎమ్‌, మసూద్‌ అజార్‌లను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలుగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని భారత్‌ డిమాండ్‌ చేస్తోంది. అయితే చైనా ఈ ప్రయత్నాన్ని అడ్డుకుంది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/movies/