అనుమతి లేకుండా వెళ్ళి.. పాక్‌ చేతిలో ఓడి

Pakistan defeat unauthorised Indian team
Pakistan defeat unauthorised Indian team

లాహోర్: అన‌ధికార క‌బ‌డ్డీ చాంపియన్‌షిప్‌లో పాకిస్థాన్ విజేతగా నిలిచింది. లాహోర్‌లోని పంజాబ్ స్టేడియం వేదికగా ఆదివారం జ‌రిగిన ఫైన‌ల్లో.. పాకిస్థాన్ 43-41తో అనధికారిక భారత జట్టుపై విజయం సాధించింది. ఆద్యాంతం హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో.. ఫ‌స్ట్ హాఫ్‌లో అనధికారిక భారత్ ఆధిపత్యం కనబర్చింది. ఆఖరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్‌లో చివరకు విజయం ఆతిథ్య జట్టునే వరించింది. కీలక సమయంలో జోరు ప్రదర్శించిన పాక్ ఆటగాళ్లు విజయంతో పాటు ప్రపంచకబడ్డీ టైటిల్‌ను అందుకున్నారు. అయితే వాస్త‌వానికి పాక్‌కు వెళ్లింది అస‌లైన భారత జట్టు కాదు. ఈ టోర్నీలో పాల్గొన్న భారత కబడ్డీ జట్టుకు భారత కబడ్డీ సమాఖ్య అనుమతిలేదు. క్రీడా, విదేశీ, హోం శాఖలు పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో ఈ టోర్నీలో భారత ఆటగాళ్లు దేశ జెర్సీలతో బరిలోకి దిగలేదు. అయితే ఈ టోర్నీలో ఎవరి అనుమతి లేకుండా పాల్గొనడంపై తీవ్ర దుమారం రేగింది. ఈ టోర్నీలో పాల్గొనడానికి ఏ ఒక్కరికి కూడా అనుమతివ్వలేదని కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా స్పష్టం చేశారు.అమెచ్యూర్ క‌బ‌డ్డీ ఫెడ‌రేష‌న్, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) కూడా తామెవరికీ అనుమతి ఇవ్వలేదని, ఎలాంటి జట్టను పంపిచలేదని స్పష్టం చేశాయి. ఐఓఏ ప్రెసిడెంట్ నరిందర్ బత్రా అయితే అనుమతి లేకుండా వెళ్లిన జట్టు భారత జెండా, పేరు ఉపయోగించుకోవడాని వీల్లేదని స్పష్టం చేశారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/