మేం తొలుత భారత్‌పై అణ్వాయుధాలు ప్రయోగించబోం

యుద్ధం సమస్యల్ని పరిష్కరించదు

Imran Khan
Imran Khan

ఇస్లామాబాద్‌: భారత్‌పై తాము తొలుత అణ్వాయుధాలు ప్రయోగించబోమని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. భారత్పాక్‌లు రెండూ అణ్వస్త్ర దేశాలేనన్న ఇమ్రాన్.. భారత్‌‌పై తమంతతాముగా తొలుత అణ్వస్త్రాలను ప్రయోగించబోమన్నారు. అలాగే, మిలటరీ చర్య కూడా చేపట్టబోమని స్పష్టం చేశారు. ”మనవి రెండూ అణ్వాయుధ దేశాలే. ప్రస్తుతం ఉన్న ఉద్రిక్తతలు మరింత పెరిగితే ప్రపంచానికే ప్రమాదం” అని ఇమ్రాన్ పేర్కొన్నారు. లాహోర్‌లోని గవర్నర్ హౌస్‌లో సోమవారం జరిగిన తొలి అంతర్జాతీయ సిక్కు సమావేశంలో పాల్గొన్న ఇమ్రాన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తమవైపు నుంచి తొలుత అణ్వాయుధ ప్రయోగం ఉండదని తేల్చి చెప్పారు. యుద్ధం సమస్యల్ని పరిష్కరించదని ఇమ్రాన్ స్పష్టం చేశారు. కశ్మీర్ సున్నిత అంశం కాదని వాదించేవారు చరిత్రను ఓసారి చదువుకోవాలని సూచించారు.

యుద్ధం ద్వారా ఓ సమస్యను పరిష్కరించుకోవాలనుకుంటే మరిన్ని సమస్యలు వస్తాయన్నారు. అంతేకాదు, యుద్ధంలో విజయం సాధించినా దానివల్ల జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు సంవత్సరాలు పడుతుందని ఇమ్రాన్ పేర్కొన్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/