మెజారిటీ కోల్పోయిన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్

రేపే పాక్ నేషనల్ అసెంబ్లీలో ఇమ్రాన్ పై అవిశ్వాస తీర్మానం

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పీఠం ఇక పోయినట్టే. ఆయన ఖేల్ ఖతమైపోయినట్టే. రేపు పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో ఆయనపై అవిశ్వాస తీర్మానం ఉండగా.. ఇవాళ ఆయన తన మెజారిటీని కోల్పోయారు. ఇమ్రాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) మిత్రపక్షం ముత్తాహిదా ఖ్వామీ మూవ్ మెంట్ పాకిస్థాన్ (ఎంక్యూఎం) ఆయనకు షాక్ ఇచ్చింది. అధికార పార్టీకి మద్దతును ఉపసంహరించుకుంది. పాక్ ప్రతిపక్షం పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ)తో చేతులు కలిపింది. దీంతో ఇమ్రాన్ ఖాన్ కు మరో రోజులో పదవీ గండం ఉందని ఆ దేశ రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. ‘‘ప్రతిపక్షాలు, ఎంక్యూఎం మధ్య పరస్పర అంగీకారం కుదిరింది. ఆ ఒప్పందానికి సంబంధించిన వివరాలన్నింటినీ మీడియా ముందు రేపు చెబుతాం. పాకిస్థాన్ కు శుభాకాంక్షలు’’ అంటూ పీపీపీ చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ ట్వీట్ చేశారు.

ప్రస్తుతం ప్రతిపక్షాలన్నింటికీ కలిపి ఆ దేశ దిగువ సభ అయిన నేషనల్ అసెంబ్లీలో 177 మంది సభ్యుల బలం ఉంది. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వానికి కేవలం 164 మంది సభ్యుల బలమే ఉంది. దీంతో ఇమ్రాన్ ఖాన్ అధికారం నుంచి దిగిపోవడం లాంఛనమే కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలపై ఇమ్రాన్ ఖాన్ విరుచుకుపడ్డారు. విదేశీ నిధులతో తన ప్రభుత్వంపై కుట్ర పన్నారని ఆరోపించారు. తన ఆరోపణలు నిజమని నిరూపించేందుకు ఆధారాలను పాకిస్థాన్ చీఫ్ జస్టిస్ ముందు పెట్టబోతున్నారని పాక్ మంత్రి అసద్ ఉమర్ అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/