పుల్వామా దాడి..పాక్‌ సంచలన వ్యాఖ్యలు

పుల్వామా దాడి మా పనే..పార్లమెంట్‌ సాక్షిగా ఒప్పుకున్న పాకిస్థాన్‌

pulawama attack
pulawama attack

ఇస్లామాబాద్‌: గతేడాది ఫిబ్రవరి 14న కశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. అయితే పుల్వామా ఘటనకు తమకు ఎలాంటి సంబంధం లేదని ఇన్నాళ్లు బుకాయిస్తూ వస్తున్న పాకిస్థాన్‌ నిజాన్ని ఒప్పుకున్నది. ఆ ఉగ్రదాడి పూర్తిగా తమ పనేనని పాక్‌ సీనియర్‌ మంత్రి ఫవాద్‌ చౌదరి ఆ దేశ పార్లమెంట్‌ సాక్షిగా వెల్లడించారు. అంతేకాదు ఆ ఉగ్రదాడి తమ ప్రజల విజయంగా అభివర్ణించారు.  పుల్వామా ఉగ్రదాడి ద్వారా భారత్‌కు వ్యతిరేకంగా సీమాంతర ఉగ్రవాదానికి మద్దతిస్తున్నట్టు తమ పార్లమెంట్‌ వేదికగా తన నోటితో తనే ప్రపంచానికి చెప్పినట్టు అయింది. భారత్‌లోకి చొరబడి భారత సైనికులను చంపేశాం (హమ్‌నే హిందూస్థాన్‌ కో గుస్‌ కే మారా) అని ఆ దేశ సీనియర్‌ మంత్రి ఫవాద్‌ చౌదరి పార్లమెంట్‌ సాక్షిగా చెప్పారు. పార్లమెంటు సమావేశాల్లో భాగంగా గురువారం ఆయన మాట్లాడుతూ.. ‘భారత్‌లోకి చొరబడి భారత సైనికులను 40 మందిని చంపేశాం. పుల్వామా విజయం పాకిస్థాన్‌ ప్రజల విజయం. ఈ ఘనత ప్రధాని ఇమ్రాన్‌కే చెందుతుంది. ఇది  గొప్ప విషయం. ఈ విజయంలో అందరికీ భాగం ఉంది’ అని మంత్రి ఫవాద్‌ చౌదరి చెప్పారు. 

కాగా పుల్వామా దాడి ఘటన వెనుక ఉన్నది తామేనని పాక్ మంత్రి ప్రకటించడం పట్ల భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పాక్ ను క్షమించరాదని, పాక్ నిజస్వరూపం ఎలాంటిదో ప్రపంచం ఇప్పటికైనా గ్రహించాలని పేర్కొంది. పుల్వామా దాడి వెనుక ఉన్న సూత్రధారులం తామేనని పాక్ ఇప్పుడు బహిరంగంగానే సమర్థించుకుంటోందని వెల్లడించింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/