భారత్‌పై పలు కీలక నిర్ణయాలు తీసుకున్న పాక్‌

హైకమిషనర్‌ బిసారియా బహిష్కరణ 

Imran Khan
Imran Khan

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ అధ్యక్షతన బుధవారం జరిగిన జాతీయ భద్రతా కమిటీ(ఎన్‌ఎస్‌సీ) సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జమ్ముకశ్మీర్‌పై భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై పాక్‌ తీవ్రంగా స్పందించింది. ఆ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని చట్టవిరుద్ధంగా, ఏకపక్షంగా రద్దు చేసిందని విమర్శించింది. ఇందుకు ప్రతిచర్యగా భారత్‌తో దౌత్య సంబంధాలను కనిష్ఠ స్థాయిగకి తగ్గించింది. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రద్దు చేసింది. ఇస్లామాబాద్‌లోని భారత హై కమిషనర్‌ అజయ్‌ బిసారియాను బహిష్కరించింది. ఢిల్లీ లో బాధ్యతలు స్వీకరించాల్సి ఉన్న తమ రాయబారి మొయిన్‌ ఉల్‌ హక్‌ను అక్కడికి పంపరాదని నిర్ణయించింది. అత్యున్నతస్థాయి పౌర, మిలిటరీ అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. దేశ భద్రతకు సంబంధించి ఈ సంఘమే చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలపై ప్రభుత్వం ప్రకటన వెలువరించింది.

”భారత్‌తో దౌత్య సంబంధాలను చాలా తక్కువ స్థాయిలోనే జరపాలని ఈ సమావేశం నిర్ణయించింది. ఇరు దేశాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందాలను పునఃసమీక్షించాలని తీర్మానించింది. స్వాతంత్య్ర దినోత్సవమైన ఆగస్టు 14ను కశ్మీరీల సంఘీభావ దినంగా పాటించాలని, ఆగస్టు 15న నల్ల దినంగా జరపాలని సూచించింది.” అని ప్రకటన పేర్కొంది. దౌత్య సంబంధాలను బాగా తగ్గించాలన్న నిర్ణయం వెలువడిన నిమిషాల్లోనే భారత హైకమిషనర్‌ బహిష్కరణపై ఉత్తర్వులు వెలువడ్డాయి. ”ఇకపై మా రాయబారులు ఢిల్లీ లో ఉండరు. ఇక్కడ ఉన్న వారి రాయబారులను వెనక్కి పంపిస్తాం” అని విదేశాంగ మంత్రి షా మెహమూద్‌ ఖురేషి చెప్పారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/