రవాణా రైళ్లను పునరుద్ధరించండి

కేంద్రానికి లేఖ రాసిన పంజాబ్‌ సిఎం అమరీందర్‌ సింగ్‌

amarinder singh
amarinder singh

చండీగర్‌: చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో, ముఖ్యంగా లడఖ్, కశ్మీర్ ప్రాంతాల్లోని భారత జవాన్లకు నిత్యావసరాల కొరత ఏర్పడే ప్రమాదం ఉందని, వెంటనే తమ రాష్ట్రంలో సరకు రవాణా రైళ్లను పునరుద్ధరించి, వారి అవసరాలను తీర్చాలని పంజాబ్ సిఎం అమరీందర్ సింగ్ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఆయన ఓ లేఖను రాశారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ, పంజాబ్ లో నిరసనలు మిన్నంటిన వేళ, రాష్ట్రం నుంచి వెళ్లే అన్ని గూడ్స్ రైళ్లను రైల్వే శాఖ నిలిపివేసిన సంగతి తెలిసిందే.

ఆ విషయాన్నే ప్రస్తావించిన అమరీందర్ సింగ్, శీతాకాలం వస్తోందని, గూడ్స్ రైళ్లు తిప్పాలన్నా కష్టతరం అవుతుందని గుర్తు చేస్తూ, మంచు కప్పేయకముందే సైనికుల అవసరాలను తీర్చేందుకు, మారుమూల ప్రాంతాలకు సరకులను పంపేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని సూచించారు. తన ప్రభుత్వం నక్సల్స్ దళాలతో చేతులు కలిపిందని బిజెపి అసత్య ఆరోపణలు చేస్తోందని, రైతులు తమ నిరసనలు తెలిపితే, సైన్యం మీద కోపం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయని అన్నారు.

సైనికుల మీద ఒత్తిడి పెరుగుతోందని, వారు దేశ రక్షణ కోసం కృషి చేస్తుంటే, కనీస అవసరాలను తీర్చాలన్న విషయాన్ని బిజెపి మరచిపోయిందని, బిజెపి తక్షణం స్పందించకుంటే, పరిస్థితులు తీవ్రంగా మారుతాయని అమరీందర్ సింగ్ తన లేఖలో హెచ్చరించారు. గూడ్స్ రైళ్లు నడవక పోవడంతో పరిశ్రమలు, వ్యవసాయ రంగం కూడా నష్టపోతున్నాయని వెల్లడించిన ఆయన, వెంటనే సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/