జాదవ్ రివ్యూ పిటిషన్ పై పాక్‌ మరో కొత్త వాదన

పాక్ చెరలో మగ్గిపోతున్న కుల్ భూషణ్ జాదవ్

Kulbhushan jadhav

ఇస్లామాబాద్‌: గూఢచర్యం ఆరోపణలపై పాకిస్థాన్ చెరలో మాజీ నేవీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ ను ఉన్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలోనే పాక్‌ అనుమానాస్పద రీతిలో కొత్త వాదన తెరపైకి తెచ్చింది. కుల్ భూషణ్ జాదవ్ రివ్యూ పిటిషన్ వేసేందుకు నిరాకరిస్తున్నాడని, గతంలో విధించిన మరణశిక్షకు సంబంధించి పెండింగ్ లో ఉన్న క్షమాభిక్ష వైపే మొగ్గు చూపుతున్నాడని పాక్ ఆరోపించింది.

దీనిపై పాక్ అదనపు అటార్నీ జనరల్ మాట్లాడుతూ..’నేర నిరూపణ, మరణశిక్షకు సంబంధించి పునఃసమీక్ష కోరుతూ రివ్యూ పిటిషన్ వేయాలని కుల్ భూషణ్ జాదవ్ కు అవకాశం ఇచ్చాం. కానీ అతడు సుముఖత చూపలేదు. పెండింగ్ లో ఉన్న తన క్షమాభిక్ష పిటిషన్ పై వచ్చే నిర్ణయం కోసం ఎదురుచూడాలని నిర్ణయించుకున్నాడు’ అని వివరించారు. కాగా, కుల్ భూషణ్ యాదవ్ కు రెండోసారి దౌత్యపరమైన సాయం అందించేందుకు పాక్ ప్రభుత్వం ముందుకొచ్చిందని అక్కడి మీడియా పేర్కొంది. జాదవ్ ను గూఢచర్యం ఆరోపణలపై అదుపులోకి తీసుకున్న పాక్, 2017లో మరణశిక్ష విధించింది. దీనిపై భారత్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో పాక్ కు ముకుతాడు పడింది. మరణశిక్షను సవాల్ చేసేందుకు వీలుగా జాదవ్ కు దౌత్యపరమైన సాయం అందించడంలేదంటూ పాక్ పై భారత్ ఫిర్యాదు చేసింది. దాంతో ఐసీజే తీర్పునిస్తూ, జాదవ్ మరణశిక్షపై పునఃసమీక్షకు అవకాశం ఇవ్వాలంటూ ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే పాక్ తాజా ఆరోపణలు చేస్తున్నట్టు తెలుస్తోంది.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/