పుతిన్ తో భేటి సందర్భంగా పాక్‌ ప్రధాని అవస్థలు

ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడంలో ఇబ్బంది పడ్డ పాక్ పీఎం

pak-pms-embarrassing-moment-at-meeting-and-putin-laughs

ఉజ్బెకిస్తాన్‌ : ఉజ్బెకిస్థాన్ లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) శిఖరాగ్ర సమావేశం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో పాకిస్థాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పాక్ ప్రధాని అవస్థలు పడ్డారు. ఈ భేటీలో పాక్ ప్రధాని షరీఫ్ హెడ్‌ఫోన్‌ను పెట్టుకోవడానికి ప్రయత్నించి, విఫలయయ్యారు. అది చూసి రష్యా అధ్యక్షుడు పుతిన్ నవ్వడం వైరల్ గా మారింది. షాంఘై సహకార సంఘం సమావేశం (షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO) 22వ శిఖరాగ్ర సమావేశం చర్చల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలో పాక్ షరీఫ్ చెవి నుండి హెడ్ ఫోన్ పడిపోయింది. ఇది పుతిన్ కు నవ్విను తెప్పించింది. అయితే ప్రారంభంలో పాకిస్తాన్ ప్రధాని మంత్రి తన హెడ్‌ఫోన్‌ను సరిచేయడానికి కొంత సమయం తీసుకున్నారు. అప్పటికే పుతిన్ సంభాషణ కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నారు. దాంతో.. ఆలస్యమవుతుందన్న కారణంతో ఒక అధికారిని పిలిపించి, సహాయం చేయవల్సిందిగా షరీఫ్ కోరారు. ఆ తర్వాత సమావేశం ప్రారంభిద్దామనుకునే లోపే మళ్లీ అది షరీఫ్ చెవి నుంచి పడిపోయింది. దీంతో ఆ అధికారి మళ్లీ వచ్చి ఆ పరికరాన్ని షరీఫ్ చెవికి అమర్చి వెళ్లిపోయారు. ఈ ఘటనతో అప్పటికే నవ్వును ఆపుకుంటున్న పుతిన్.. నియంత్రించుకోలేకపోయారు.

సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. మరోవైపు ఈ సంఘటన దేశానికి “అవమానకరం” అని పేర్కొంటూ పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. అనంతరం పుతిన్ మాట్లాడుతూ.. పాకిస్థాన్‌, రష్యా మధ్య మౌలిక సదుపాయాలు ఇప్పటికే ఉన్నందువల్ల గ్యాస్ సరఫరాకు సరఫరా చేస్తామన్నారు. రష్యా, కజకిస్ఠాన్, ఉజ్బెకిస్థాన్‌లలో మౌలిక సదుపాయాలున్నాయని, ఇక ఆఫ్ఘనిస్థాన్ సమస్యను పరిష్కరించుకోవలసి ఉందని తెలిపారు. ఇదిలా ఉండగా కొవిడ్ కారణంగా రెండేళ్ల తర్వాత జరుగుతున్న మొదటి వ్యక్తిగత శిఖరాగ్ర సమావేశం ఇది. ఈ సమావేశాలు సెప్టెంబరు 15న ప్రారంభమయ్యాయి, శుక్రవారం ముగుస్తాయి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/business/