పాక్ ప్రజలు టీ తాగడాన్ని తగ్గించండి : మంత్రి పిలుపు

రోజులో ఒకటి రెండు కప్పులైనా తగ్గించుకోవాలని వినతి
ఆర్థిక వ్యవస్థపై దిగుమతుల భారం పడుతోందన్న పాక్ మంత్రి

ఇస్లామాబాద్‌: ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో పాకిస్థాన్‌ ప్రజలకు ఆ దేశ ప్రణాళిక శాఖ మంత్రి అహ్సన్‌ ఇక్బాల్‌ ఓ సలహా ఇచ్చారు. ప్రజలు టీ తాగడాన్ని తగ్గించుకుని దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడాలని కోరారు. ‘‘ఒక్కో పౌరుడు కనీసం రోజులో ఒకటి రెండు కప్పుల టీ తగ్గించుకోవాలి. ఎందుకంటే దిగుమతుల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై అదనపు భారం పడుతోంది’’ అని ఇక్బాల్ పేర్కొన్నారు.

రుణాలు తీసుకుని పాకిస్థాన్ తేయాకును దిగుమతి చేసుకుంటున్న విషయాన్ని ఇక్బాల్ ప్రస్తావించారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే పాకిస్థాన్ 2021-22లో 13 బిలియన్ డాలర్ల అదనపు తేయాకును దిగుమతి చేసుకుందని అక్కడి ఫెడరల్ బడ్జెట్ పత్రాలు స్పష్టం చేస్తున్నాయి. పాకిస్థాన్ పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో ఉన్న విషయం గమనార్హం.

గత వారమే పాక్ సర్కారు 2022-23 సంవత్సరానికి 47 బిలియన్ డాలర్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఐఎంఎఫ్ నుంచి 6 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం పొందడం కోసం (బెయిలవుట్ ప్యాకేజీ) ప్రస్తుతం పాక్ సర్కారు పలు చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో పాక్ మంత్రి ఇలా పిలుపునివ్వడం గమనించాలి. పెరిగిపోయిన ఆహారం, చమురు ధరలతో పాక్ ప్రజలు జీవనానికి తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/