పాక్‌ మసీదులో ఆత్మాహుతి దాడి.. 90కి పెరిగిన మృతుల సంఖ్య

శిథిలాల కింద పెద్ద సంఖ్యలో మృతదేహాలు

pak-blast-that-killed-more-than-90-people

ఇస్లామాబాద్ః పెషావర్ లోని మసీదులో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఉగ్రదాడి ఘటనలో మృతుల సంఖ్య 90 కు పెరిగిందని పాకిస్థాన్ అధికారులు పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం ప్రార్థన సమయంలో ఓ ఉగ్రవాది తనను తాను పేల్చేసుకున్నాడు. దీంతో భారీ విస్పోటనం జరిగింది. మసీదు గోడ కూలిపోయింది. ఈ దాడిలో 83 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.

మరో 150 మంది గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వివరించారు. పేలుడు ధాటికి మసీదు గోడలో కొంతభాగం కూలిపోయింది. ఆ శిథిలాల కింద చిక్కుకుని చాలామంది చనిపోయారు. పేలుడు తర్వాత అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయని తెలిపారు.

మంగళవారం ఉదయం కూడా సహాయక కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. కాగా, ఈ పేలుడుకు పాల్పడింది తమ ఆత్మాహుతి దళ సభ్యుడేనని తెహ్రీక్-ఐ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) సంస్థ సోమవారం ప్రకటించుకుంది. సిటీలోని పోలీస్ కార్యాలయం ఆవరణలో అత్యంత భద్రత ఉండే చోట పేలుడు జరగడంపై అధికారవర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.