వనజీవి రామయ్యకు ప్రమాదం..అండగా ఉంటామని హరీష్ రావు హామీ

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వనజీవి రామయ్యకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. ప్రముఖ పర్యావరణ ప్రేమికుడు, వనజీవి, పద్మశ్రీ రామయ్య ఈరోజు ఉదయం ప్రమాదానికి గురయ్యారు. పల్లెగూడెంలో మొక్కలకు నీళ్లు పోసేందుకు బైక్ పై వెళ్తున్నారు. ఇదే సమయంలో వేగంగా వచ్చిన ఒక బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయనకు కాలు విరిగింది.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు ఆయనను హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. రామయ్య ప్రమాద విషయం తెలుసుకున్న మంత్రి హరీష్ రావు..రామయ్య ఆరోగ్య పరిస్థితి గురించి హాస్పిటల్‌ ప్రధాన వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయనకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. రామయ్యకు అన్నివిధాలుగా అండగా ఉంటామని ఆయన కుటుంబ సభ్యులకు మంత్రి హరీశ్‌ హామీ ఇచ్చారు. వనజీవి రామయ్య ప్రమాదానికి గురవడం పట్ల మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. రామయ్యకు మెరుగైన వైద్యచికిత్సలు అందించాలని వైద్యులను ఆదేశించారు. ఆరోగ్య పరిస్థితిపై ఫోన్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు.