రేషన్ కార్డు దారులకు తీపి కబురు.. మరో ఏడాది పాటు ఫ్రీ రేషన్

రేషన్ కార్డు దారులకు తీపి కబురు తెలిపింది కేంద్రం. మరో ఏడాది పాటు రేషన్ కార్డు దారులకు ఫ్రీ గా రేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద 81కోట్ల మందికి రేషన్ అందించాలని నిర్ణయం తీసుకుంది కేంద్ర కేబినెట్. ఫ్రీ రేషన్‌తో కేంద్రంపై రెండు లక్షల కోట్ల రూపాయల భారం పడుతుందన్నారు సెంట్రల్ మినిస్టర్ పీయూష్ గోయల్. ఈ ఖర్చు మొత్తాన్ని కేంద్రమే భరిస్తుందని ప్రకటించారు. ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే వచ్చే ఏడాది డిసెంబర్ వరకు ఉచిత రేషన్ అందించనున్నట్లు చెప్పారు. దీన్ని పేదలకు న్యూఇయర్ గిఫ్ట్‌గా అభివర్ణించారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ఈ స్కీమ్ కింద ప్రతి ఒక్కరికి నెలకు ఐదు కిలోల చొప్పున ఆహార ధాన్యాలు పంపిణీ చేయనుంది.
అంత్యోదయ అన్న యోజన పథకం కింద ఒక్కో కుటుంబానికి 35 కిలోల బియ్యం లేదా గోధుములు అందిస్తోంది కేంద్రం. అయితే, 2020లో కరోనా కారణంగా లాక్‌డౌన్ ప్రారంభమైన తరువాత ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన స్కీమ్ ను ప్రారంభించింది కేంద్రం. అయితే, ఈ స్కీమ్ గడుపు డిసెంబర్‌తో ముగియనుంది. మళ్లీ ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని పొడిగించకూడదని నిర్ణయం తీసుకుంది కేంద్ర కేబినెట్. అయితే, దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తన నిర్ణయాన్ని మార్చుకుని.. మరోసారి పథకాన్ని పొడిగించారు.