ర‌ష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం.. ఉక్రెయిన్‌ విడిచి వెళ్లిన 60 లక్షల మంది: ఐరాస

వలసవాదుల్లో మహిళలు, పిల్లలే 90 శాతం మందన్న ఐరాస‌

జెనీవా : ఉక్రెయిన్‌-ర‌ష్యా మ‌ధ్య యుద్ధం జ‌రుగుతోన్న నేప‌థ్యంలో ఉక్రెయిన్ నుంచి ఇత‌ర దేశాల‌కు వ‌ల‌స‌లు వెళ్తున్నారు. ఉక్రెయిన్‌ మొత్తం జనాభా 3 కోట్ల 70 లక్షలుగా ఉండ‌గా, ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 60 లక్షల మందికిపైగా ఉక్రెయిన్ ను వదిలి ఇత‌ర దేశాల‌కు వెళ్లార‌ని ఐక్యరాజ్య సమితి తాజాగా తెలిపింది. వారిలో మహిళలు, పిల్లలే 90 శాతం మంది ఉన్నార‌ని వివ‌రించింది.

ఉక్రెయిన్ నుంచి అధిక మంది పోలండ్ కు వెళ్లి ఆశ్రయం పొందుతున్నార‌ని, పురుషులు యుద్ధంలో పాల్గొనాల్సి ఉండ‌డంతో ఉక్రెయిన్‌లోనే ఉంటుందున్నా‌ర‌ని పేర్కొంది. ఉక్రెయిన్ లో మరో 80 లక్షల మంది సొంత‌ దేశంలో ప‌లు ప్రాంతాలకు మారార‌ని తెలిపింది. ప్ర‌స్తుతం ఉక్రెయిన్ సరిహద్దులు దాటుతున్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంద‌ని చెప్పింది.

ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఫిబ్రవరి 24న ప్రారంభ‌మైంది. మార్చి నెలలో ఉక్రెయిన్‌ నుంచి 30 లక్షల మందికి పైగా ప్ర‌జ‌లు విదేశాల‌కు వెళ్లారు. ఏప్రిల్‌ నాటికి వ‌ల‌స వెళ్లిన వారి సంఖ్య 10 లక్షల మందికి పైగా చేరింది. ఈ నెల 4,93,000 మంది ఉక్రెయిన్‌ సరిహద్దులు దాటారు. 2022 ముగిసేలోపు మొత్తం 80 లక్షల మంది విదేశాల‌కు వెళ్లే అవ‌కాశం ఉంది.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/