విరుచుకుపడుతున్న కరోనా.. జనం హైరానా!

కరోనా వైరస్ రోజురోజుకూ తన పంజా విసురుతూ ప్రజల ప్రాణాలను హరిస్తూ వస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్ విధించాలా వద్దా అనే సంధిగ్ధంలో పడింది. కాగా గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరోసారి భయాందోళనకు గురిచేస్తున్నాయి.

దేశవ్యాప్తంగా కొత్తగా 4,14,188 మందికి కరోనా సోకినట్లు వైద్య శాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు భారతదేశంలో 2,14,91,598 మందికి కరోనా సోకగా 1,76,12,351 మంది ఈ వైరస్ నుండి కోలుకొన్నారు. కాగా ఇంకా దేశవ్యాప్తంగా 36,45,164 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు వైద్య శాఖ ప్రకటించింది. కాగా గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3915 మంది కరోనా బారిన పడి అసువులు బాసారు.

తాజా లెక్కలతో కలుపుకుని ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2,34,083 మంది మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. ఏదేమైనా దేశవ్యాప్తంలో మరోసారి లాక్‌డౌన్ విధిస్తేనే ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని ప్రజల నుండి పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తున్నా, కేంద్రం మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలకే నిర్ణయాన్ని వదిలేయడం గమనార్హం.