‘విలన్’కు అత్యుత్తమ బహుమతి
‘వార్తల్లోని వ్యక్తి’ ప్రతి సోమవారం

వదల! నిన్నొదల! బొమ్మాళి! ఈ మాటలు ఎక్కడో విన్నట్టున్నాయి కదూ! ఏ పాటలు, ఏ మాటలు విన్నా ఈ మాటలు మరచిపోము కదూ!
‘అరుంధతి’ సినిమాలో ఆ మాటలన్న సోనుసూద్ ముఖం తెరపై భయంకరం, మాట కఠోరం.
ఆయనకు మొన్న ఐక్యరాజ్యసమితి ఆయన మానవతా దృష్టికి ప్రత్యేక అవార్డునిచ్చి గౌరవించింది.
ఇంత అత్యున్నతమైన అంతర్జాతీయ అవార్డు తనకు లభిస్తుందని ఆయన కాని, మనం కాని అనుకోలేదు.
కొవిడ్-19 ప్రభావం వల్ల ఎందరో భారతీయులు ఇతరదేశాలలో చిక్కుకుపోయారు. వారిని స్వదేశం చేర్చే దిక్కుదివాణం లేదు. సౌకర్యాలు లేవు.
సినిమాలలో విలన్‌గా ఆయన పాత్రలు ప్రసిద్ధం. అందులోను ‘అరుంధతి చిత్రంలో ఆయన నటన, ఉచ్ఛారణ విలక్షణమైనవి.
సినీ కళాకారులకు బహుమతులు, విభిన్న గౌరవాలు ప్రసిద్ధమే. అయితే సోను బహుమతి విభిన్నమైనది. అది ఆయన మానవతకు, మానవ కారుణ్యానికి లభించినట్టిది.
బహుశా ఒక సినీ నటునికి, అందులోను మొదటిసారిగా ఒక భారతీయ సినీ ‘విలన్‌కు లభించడమేమిటి? సూద్‌కు ఇదివరకు లభించిన అవార్డులు భారతీయమైనవి.
‘విలన్ పాత్రధారికి ప్రపంచ సంస్థ బహుమతా?
ఇది విచిత్రంగా, వింతగాలేదూ? ఈ వింత ‘హీరో- విలన్ వివరాలు తెలుసుకోవాలని కుతూహలం కలగడం సహజం.
పంజాబీ: సోను పంజాబ్‌లోని మోగా వర్గానికి చెందినవాడు. చదువూసంధ్యలేని వాడేవిూకాదు. బి.ఇ-ఇంజినీర్.
అవార్డులు, రివార్డులు:
2009లో ఆయనకు ఉత్తమ ‘విలన్పాత్రధారిగా మన నంది అవార్డు లభించింది. ఉత్తమ సహాయ నటుడుగా ‘ఫిలింఫేర్ అవార్డు ఇచ్చారు. ఉత్తమ నటుడు అవార్డో, సహాయనటుడు అవార్డో లభించడం సహజం.
అలాంటిది సోనుకు లభించనవన్నీ ‘ఉత్తమ దుష్టపాత్రధారి పాత్రల అవార్డులు.
ఆయన తండ్రిపేరు శక్తి సాగర్ సూదు. అందువల్ల ఆయన పేరిట శక్తిసాగర్ మూవీస్ అనే సినీ నిర్మాణ సంస్థను స్థాపించాడు.
కదిలించిన హృదయం, విదారక దృశ్యం
లాక్డౌన్ కాలంలో ప్రజలు చాలా మంది తిండీతిప్పలు లేకుండా బాధపడ్డం ఆయన మనస్సును కరిగించి వేసింది. అంతేకాక, ఎంతో మంది అనాధకార్మికులు పనీపాటలేక, తిండికి లేక ఆత్మహత్యలు చేసుకొనడం, కనిపించకుండాపోవడం ఆయనను కలచివేసింది!
అన్నార్తులైనవారికి అన్నపానాలు ఏర్పాటు చేయడం వారిని స్వస్థలాలకు పంపించడానికి బస్సులు, ప్రత్యేక రైళ్లు, చివరకు విమానాలను కూడా ఏర్పాటు చేసి, వారి అభినందనలు పొందగలిగారు.
మొన్న జులై 25న సూద్‌కు ఒక దృశ్యం కనిపించింది. ఇద్దరు ఆడపిల్లలు తమ నాగలిని చెరొక భుజంపై ధరించి, తమ భూమిని దున్నడం ఆయనను కలచివేసింది. సూద్ వెంటనే ఆ కుటుంబానికి ట్రాక్టర్‌ను పంపించారు.
2020 ఆగస్టులో 101 మంది తమిళ వైద్యవిద్యార్థులు మాస్కోలో చిక్కుకుపోవడం ఆయనను కదిలించి వేసింది. వెంటనే ఆయన మాస్కోకు ఒక ప్రత్యేక విమానాన్ని పంపి ఆ విద్యార్థులను చెన్న§్ు చేర్చారు.
తన జన్మదినోత్సవం (జులై 30) రోజున ఆయన ఒక సంస్థను నెలకొల్పి, ఇతర చోట్ల చిక్కుకుపోయిన అనాథ కార్మికులను స్వస్థలాలకు చేర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలాంటి ఎన్నో మానవతా కార్యక్రమాలను ఆయన చేస్తున్నారు.
ఇలాంటి ప్రజాహిత కార్యక్రమాలను ఏ సినీనటుడు చేశాడు?మహా అయితే, వారి సంక్షేమానికి కొంత విరాళమిస్తున్నారు. అందు వల్లనే ఐక్యరాజ్యసమితి ఆయన అంత అఖండమైన అవార్డును ప్రదానం చేసింది. ఆయనకు వివాహమైనది. భార్యపేరు సోనాలి. ఇద్దరు పిల్లలు. ఆయన వయస్సు 47 సంవత్సరాలు.
- డాక్టర్ తుర్లపాటి కుటుంబ రావు, (‘పద్మశ్రీ’ అవార్డు గ్రహీత)
తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/