తొలి దశ గణాంకాలు ప్రోత్సాహకరం..క్యూర్ వాక్

కరోనా పై మా టీకా ఫలితాలు బాగున్నాయి: క్యూర్ వాక్

తొలి దశ గణాంకాలు ప్రోత్సాహకరం..క్యూర్ వాక్
Our Covid Vaccine Triggers Immune Response In Humans : CureVac

జర్మనీ: కరోనా మహమ్మారి నియంత్రణ వ్యాక్సిన్‌ కోసం ప్రపంచ దేశాలు ఎదురు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాము తయారు చేసిన కొవిడ్ 19 వ్యాక్సిన్, మానవుల్లో రోగ నిరోధక శక్తిని పెంచుతోందని జర్మనీ కేంద్రంగా పనిచేస్తున్న క్యూర్ వాక్ వెల్లడించింది. ఈ మేరకు సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫ్రాంజ్ వెర్నర్, ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సంవత్సరం భారీ ఎత్తున ట్రయల్స్ నిర్వహించి, వాటి ఫలితాల సమీక్ష తరువాత, వ్యాక్సిన్ ను బయటకు విడుదల చేస్తామని అన్నారు. ‘తొలి దశ గణాంకాలు మమ్మల్ని ఎంతో ప్రోత్సహించాయి’ అని ఆయన అన్నారు.

కాగా, మెసింజర్ ఆర్ఎన్ఏ (ఎంఆర్ఎన్ఏ) ఆధారంగా క్యూర్ వాక్ తన టీకాను అభివృద్ధి చేసింది. ఇదే తరహాలో మోడెర్నా, బయోఎన్ టెక్, పిఫైజర్ తదితరాలు కూడా టీకాను రూపొందించిన సంగతి తెలిసిందే. ఇక క్యూర్ వాక్, తన టీకాకు ‘సీవీఎన్ సీఓవీ’ అని నామకరణం చేసింది. ఈ సంవత్సరం చివరిలోగా 30 వేల మంది వలంటీర్లకు టీకాను ఇచ్చి, ఫలితాల విశ్లేషణ తరువాత, మార్కెట్లోకి విడుదల చేయాలని భావిస్తోంది.

ఈ వ్యాక్సిన్ ను భారీ ఎత్తున తయారు చేసేందుకు జర్మనీకే చెందిన బయోటెక్ పెట్టుబడిదారు టైట్ మార్ హోప్, గేట్స్ ఫౌండేషన్, గ్లాక్సో స్మిత్ క్లయిన్ తదితర సంస్థలు ఇప్పటికే పెట్టుబడులను సమకూర్చాయి. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కరోనాను అడ్డుకునే యాంటీబాడీల వృద్ధి కనిపిస్తోందని సంస్థ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 12 లక్షల మందిని పొట్టన బెట్టుకున్న ఈ మహమ్మారిని నిలువరించేందుకు 45 రకాల టీకాలు పలు దశల ట్రయల్స్ లో ఉన్నాయి. వీటిల్లో ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనికా సంయుక్తంగా తయారు చేసిన వ్యాక్సిన్ తో పాటు, ఇండియాలో ప్రయోగదశలో ఉన్న వ్యాక్సిన్లు సైతం ప్రపంచ మానవాళికి ఆశలను పెంచుతున్నాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/