మా దేశం ఎప్పుడూ ఆధిపత్యాన్ని కోరుకోదు

విభేదాలను తగ్గించుకునే ప్రయత్నాలు చేయాలి

Xi Jinping

బీజింగ్‌: చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ ఐక్యరాజ్యసమితి నిర్వహించిన ఓ సమావేశం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతూ.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తూర్పు లడఖ్‌లోని చైనా, భారత్ ‌సైన్యాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో విభేదాలను తగ్గించుకునే ప్రయత్నాలు చేయాలని, చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలని ఆయన చెప్పుకొచ్చారు. తమ దేశం ఎప్పుడూ ఆధిపత్యాన్ని కోరుకోదని ఆయన చెప్పారు. కోల్డ్‌వార్‌, హాట్‌ వార్‌ లాంటివి తమకు అవసరం లేదని చెప్పుకొచ్చారు. కాగా, తాము దేశీయంగా, అంతర్జాతీయంగా నూతన అభివృద్ధి నమూనాని రూపొందించాలని ధ్యేయంగా పెట్టుకున్నామని జిన్ పింగ్ చెప్పారు. తమ దేశం ప్రపంచ ఆర్థిక వృద్ధికి కూడా తోడ్పాటునందిస్తుందని ఆయన తెలిపారు.

తమ దేశం అభివృద్ధి చెందుతున్న దేశమని, ప్రపంచ దేశాలతో సత్సంబంధాలకు కట్టుబడి ఉందని చెప్పారు. పలు దేశాలతో ఉన్న విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని తెలిపారు. కాగా, కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి అన్ని దేశాలు కలిసి కృషి చేయాలని ఆయన చెప్పారు. ఇందుకోసం ఉమ్మడి ప్రణాళికను రూపొందించాలని ఆయన అన్నారు. కరోనా వైరస్ సమస్యను రాజకీయం చేయడం సరికాదని హితవు పలికారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/