పాఠశాలకు మోడీ వెళ్లడం మా ఘనతే: కేజ్రీవాల్

ఢిల్లీ స్కూళ్లను ఐదేళ్లలో తాము అద్భుతంగా తీర్చిదిద్దామన్న కేజ్రీవాల్

our-biggest-achievement-says-arvind-kejriwal-as-modi-visits-gujarat-school

న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని ఒక ప్రభుత్వ పాఠశాలను ప్రధాని మోడీ సందర్శించారు. ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థను ఆధునికీకరించే కార్యక్రమాన్ని ప్రారంభించే క్రమంలో ఆయన స్కూల్ కు వెళ్లారు. ఈ సందర్భంగా విద్యార్థుల మధ్య కూర్చున్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే దీనిపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ స్పందిస్తూ.. పాఠశాలకు మోడీ వెళ్లడం తమ ఘనతేనని అన్నారు. ఇది తాము సాధించిన గొప్ప విజయమని చెప్పారు.

మోడీని ఉద్దేశించి ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ… ‘పీఎం సర్.. పాఠశాలలు, విద్యకు సంబంధించి ఢిల్లీలో మేము మంచి కార్యక్రమాలు చేశాం. గత ఐదేళ్ల కాలంలో ఢిల్లీలోని ప్రభుత్వ స్కూళ్లను అద్భుతంగా తీర్చిదిద్దాం. మన దేశంలోని ప్రభుత్వ పాఠశాలలన్నీ ఐదేళ్లలో అభివృద్ధి చెందుతాయి. పాఠశాలలను ఎలా ఆధునికీకరించాలనే విషయంలో మాకు పూర్తి అనుభవం ఉంది. స్కూళ్లను అభివృద్ధి చేసే విషయంలో మమ్మల్ని పూర్తిగా వినియోగించుకోండి. దేశం కోసం కలిసి ఈ పని చేద్దాం’ అని అన్నారు.

మనకు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వ పాఠశాలలు, విద్య అంశాల్లో రాజకీయాలు చొరబడకపోడం సంతోషించదగ్గ విషయం అని కేజ్రీవాల్ చెప్పారు. అయితే, ఎన్నికల సమయంలోనే విద్య అనేది మనకు గుర్తుకు రాకూడదని అన్నారు. దేశంలోని అన్ని ప్రభుత్వాలు కలిసికట్టుగా పని చేస్తే కేవలం ఐదేళ్ల కాలంలో ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ అద్భుతంగా అభివృద్ధి చేయొచ్చని తెలిపారు.