అందమైన పూలమొక్క ఆర్కిడ్‌

Orchid of beautiful flower

మనసుదోచే ఆకారాల్లో ఉండే ఆర్కిడ్స్‌ ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. అదే వాటి ప్రత్యేకత. గులాబీ, తెలుపు, ఎరుపు, పసుపు, ఊదా రంగుల్లో పూసే ఆర్కిడ్‌ పూలు ఇంటికి కొత్త అందాన్నిస్తాయి. వాటిని పెంచుకోవడం తేలిక. మట్టికుండీలు, బుట్టలు, వెదురుపై ఇలా రకరకాలుగా ఈ మొక్కను సులభంగా పెంచుకోవచ్చు. ఇంటి బయటి వాతావరణంలోనూ చక్కగా పెరగుతుంది.

కొబ్బరిపీచు, చెట్ల బెరడు, ఇటుక ముక్కలను సమపాళ్లలో తీసుకుని తయారుచేసిన మిశ్రమాన్ని కుండీల్లో మాధ్యమంగా వాడుకోవాలి. కుండీ కింద చదునుగా ఉండే రాళ్లు లేదా మట్టి బెడ్డలు ఉంచాలి. ఆ తరువాత రంపంపొట్టు చల్లి మొక్కను నాటాలి. నిటారుగా పెరిగేందుకు కర్రల ఊతమివ్వాలి. లవణాలు లేని నీటిని అందించాలి. అధిక తేమ ఈ మొక్కకు చాలా అవసరం. పూలు వచ్చిన తరువాత కత్తిరింపులు చేయాలి. ఆరు నుంచి తొమ్మిది వారాల్లో కొత్త కొమ్మలు వస్తాయి. పూత వద్దనుకుంటే తక్కువ కాంతి తగిలేలా చూసుకోవాలి. నీరు ఎక్కువయితే కాండం, ఆకుకుళ్లు సమస్యలు వస్తాయి. కుండీల్లో పెంచే ఆర్కిడ్‌లను నల్లి తరచుగా ఆశిస్తుంది.
అధిక పీడనంతో నీటిని మొక్కలపై చల్లాలి. వీటి బెడద తగ్గిపోతుంది. రెండేళ్లకోసారి లేదా వేళ్లు విపరీతంగా పెరిగినప్పుడు మొక్కను వేరే కుండీలోకి మార్చాలి. ఇలా మార్చేటప్పుడు ప్రదాన వేర్లను కత్తిరించడంతో పాటు చిన్న వేర్లను మొక్క నుంచి వేరు చేయాలి. కొన్ని రోజుల పాటు నీడలోనే ఉంచాలి. కత్తిరింపులు, కణజాలవర్ధనం ద్వారా ప్రవర్ధనం చేయవచ్చు. పూతకు, మొక్క పెరుగుదలకు ఇది తప్పనిసరి. ట్రేలో గుళికలు ఉంచి నీటితో నింపాలి. అందులో నీరు తగలకుండా కుండీలను ఉంచితే బాగా ఆరోగ్యంగా పెరుగుతాయి. మూడునాలుగు రోజులకొకసారి బిందు, తుంపర్ల రూపంలో నీటిని అందించాలి. మొక్క నాటిన నెల నుంచి రెండు వారాలకొకసారి ఎరువులను అందించాలి. వెలుతురు, ఉష్ణోగ్రతతో ఆర్కిడ్‌ పెరుగుదల ముడిపడి ఉంటుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/