ఉమ్మ‌డి అభ్య‌ర్ధి గా మార్గ‌రెట్ అల్వా నామినేషన్ దాఖలు

ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల‌కు విప‌క్షాల ఉమ్మ‌డి అభ్య‌ర్ధి మార్గ‌రెట్ అల్వా మంగ‌ళ‌వారం నామినేష‌న్ ప‌త్రాలు దాఖ‌లు చేశారు. మంగళవారం ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గే తదిరుల సమక్షంలో ఆమె నామినేషన్ సమర్పించారు.

నామినేషన్‌ కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌(తెలంగాణ) దూరంగా ఉండడం గమనార్హం. మద్దతు విషయంలో ఇంకా తమ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎంపీలు జాతీయ మీడియా వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. మరికొన్ని పార్టీల నుంచి కూడా అల్వాకు మద్దతు ఇచ్చే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఎన్డీయే అభ్యర్థి జగదీప్‌ ధన్‌కర్‌ సోమవారం నాడే ప్రధాని మోడీ సమక్షంలో నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్లకు ఈరోజే తుది గడువు కాగా, ఆగష్టు 6న దేశ 14వ ఉపరాష్ట్రపతి కోసం ఎన్నిక జరగనుంది. ఆగ‌స్ట్ 10న ప్ర‌స్తుత ఉప‌రాష్ట్ర‌పతి ఎం వెంక‌య్య‌నాయుడు ప‌ద‌వీకాలం ముగుస్తుంది.

1942లో మంగళూరులోని రోమన్‌ కాథలిక్‌ కుటుంబంలో మార్గరెట్ ఆల్వా జన్మించారు. గతంలో గోవా, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేశారు. రాజకీయాల్లో విశేష అనుభవం ఉన్న పీవీ నరసింహారావు, ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీలు ప్రధానులుగా ఉన్న సమయంలో.. మార్గరెట్‌ కేంద్రమంత్రిగా సేవలందించారు. మార్గరెట్‌ 1974-98 వరకు పార్లమెంటు సభ్యురాలిగా ఉన్నారు.

సోమవారం దేశ వ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. రాష్ట్రాల అసెంబ్లీలలో ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోగా..పార్లమెంట్ ఆవరణలో ఎంపీలు ఓటు వేశారు. 4,796 మంది ఎంపీలు, ఎమ్మెల్యేల్లో 99శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. 11 రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరిలో ఎమ్మెల్యేలందరూ ఓటుహక్కు వినియోగించుకున్నారని చెప్పుకొచ్చింది. ఇక ఛత్తీస్ ఘడ్, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, కర్నాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, మిజోరం, సిక్కిం, తమిళనాడు, పాండిచ్చేరిల్లో 100శాతం ఓటింగ్ నమోదైందని ఎన్నికల అధికారు తెలిపారు.