2024లో ప్రతిపక్ష పార్టీలు బిజెపిని ఓడించలేవుః ప్రశాంత్ కిషోర్

బిజెపిని ఓడించాలంటే హిందుత్వ, జాతీయవాదం, సంక్షేమాన్ని అర్థం చేసుకోవాలని సూచన

opposition-parties-can-not-defeat-bjp-says-prashant-kishor

న్యూఢిల్లీః ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ 2024 ఎన్నికల్లో బిజెపిదే విజయమని తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించారు. విపక్షాల ఐక్యత బిజెపిని ఏమీ చేయలేదని ఆయన అన్నారు. విపక్షాలు ఏకమైనా వాటి మధ్య సిద్ధాంతపరమైన తేడాలు ఉంటాయని… వాటి ఐక్యత కూడా స్థిరంగా ఉండదని చెప్పారు. విపక్షాల ఐక్యత అంటే కేవలం ఆయా పార్టీల నేతలు కలవడం మాత్రమేనని అన్నారు. విపక్షాలు బిజెపిని ఓడించాలంటే ముందుగా హిందుత్వ, జాతీయవాదం, సంక్షేమాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఇది త్రీ లెవెల్ పిల్లర్ అని అన్నారు. వీటిలో కనీసం రెండింటిని విపక్షాలు అధిగమించపోతే… బిజెపిని అవి కనీసం ఛాలెంజ్ కూడా చేయలేవని స్పష్టం చేశారు.

హిందుత్వ సిద్ధాంతంపై పోరాడాలంటే విపక్షాలు తమ సిద్ధాంతాలను ఏకం చేయాలని… ఎవరి సిద్ధాతం వారిది అనుకుంటే బిజెపిని ఓడించలేవని పీకే చెప్పారు. గాంధీవాది, అంబేద్కరైట్స్, సోషలిస్టులు, కమ్యూనిస్టులు… ఏదైనాసరే సిద్ధాంతం అనేది చాలా ముఖ్యమని… అయితే ఈ సిద్ధాంతాల వల్లే ప్రజల నమ్మకాన్ని సాధించడం అంత ఈజీ కాదని చెప్పారు. తనది మహాత్మాగాంధీ భావజాలమని… బీహార్ లో తాను చేపట్టిన జన సూరజ్ యాత్ర లక్ష్యం కూడా గాంధీ కాంగ్రెస్ ను మళ్లీ తీసుకురావడానికి చేసే ప్రయత్నమేనని అన్నారు. విపక్షాలు ఏకం కావడం, నాయకులు కలవడం గురించే మీడియా మాట్లాడుతుంటుందని పీకే అన్నారు. ఎవరు ఎవరితో కలిసి లంచ్ చేశారు, ఎవరు ఎవరినీ టీకి పిలిచారనేది చూస్తుంటారని… తాను మాత్రం సిద్ధాంతాల పరంగా ఎలాంటి మార్పు ఉందనే కోణంలో చూస్తానని చెప్పారు. సిద్ధాంతాల ప్రకారం విపక్షాలు ఏకం కావడం కుదరని పని అని… అందుకే విపక్షాలు బిజెపిని ఓడించే అవకాశమే లేదని అన్నారు.

కాంగ్రెస్ పార్టీతో తనకు విభేదాలు వచ్చేయనే అంశంపై స్పందిస్తూ.. కాంగ్రెస్ కి పునర్జన్మను ఇవ్వాలని తాను అనుకుంటున్నానని… ఎన్నికల్లో గెలవాలని వారు అనుకుంటున్నారని… తన సలహాలను పాటించేందుకు వారు అంగీకరించలేదని పీకే చెప్పారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర గురించి మాట్లాడుతూ… ఎన్నికల్లో వచ్చే ఫలితాలే యాత్రకు అసలైన పరీక్ష అని అన్నారు. యాత్ర అంటే కేవలం నడవడం మాత్రమే కాదని… ఆరు నెలల భారత్ జోడో యాత్రలో ప్రశంసలతో పాటు విమర్శలు కూడా ఎదురయ్యాయని చెప్పారు. ఆరు నెలల పాదయాత్ర తర్వాత మార్పు ఏమైనా వచ్చిందా? అని ప్రశ్నించారు.