తగ్గుముఖం పడుతున్నా ఉల్లి ధరలు!

హైదరాబాద్‌లో రూ.70 నుంచి 90 మధ్య…విశాఖలో రూ.75 నుంచి రూ.85 మధ్య ధర

Onion
Onion

హైదరాబాద్‌: ఉల్లి ధరలు క్రమేపీ తగ్గుముఖం పడుతున్నాయి. దాదాపు డబుల్‌ సెంచరీ మార్కుకు చేరువైన ఉల్లి ధర ప్రస్తుతం గణనీయంగా తగ్గినప్పటికీ ఇంకా సెంచరీకి చేరువలో ఉండడం గమనార్హం. కొత్తపంట అందుబాటులోకి వస్తుండడం, ఎగుమతులపై నిషేధం విధించడం, ఇతరత్రా కారణాలతో ప్రస్తుతం హైదరాబాద్‌, విశాఖ వంటి ముఖ్యనగరాల్లో బహిరంగ మార్కెట్లో వందలోపే ధర పలుకుతోంది. హైదరాబాద్‌లోని మలక్‌పేట హోల్‌సేల్‌ మార్కెట్‌లో మహారాష్ట్ర నుంచి వచ్చే కొత్త ఉల్లి 70 నుంచి 90 రూపాయల మధ్య విక్రయిస్తున్నారు.

పాత ఉల్లి మాత్రం వంద రూపాయల పైనే పలుకుతోంది. మహారాష్ట్రలో గత ఏడాది సగం పంట దెబ్బతిన్నా రైతులు వెంటనే రబీ పంట వేయడంతో అది అందుబాటులోకి వచ్చింది. మరో వైపు ఆంధ్రాలో కర్నూలు ఉల్లిని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి కాకుండా నిషేధం విధించడంతో ఇక్కడ కూడా ఉల్లి ధర దిగి వస్తోంది. విశాఖ నగరంలోని జ్ఞానాపురం హోల్‌సేల్‌ మార్కెట్‌లో నిన్న రూ.80కు అమ్మకాలు జరిపారు. రైతు బజార్లలో సబ్సిడీ ఉల్లి రూ.25కు అందిస్తుండగా, సాధారణ కౌంటర్లలో 85 రూపాయలు చొప్పున అమ్మకాలు జరిపారు.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/