మూడేళ్లలో మూడో వంతు ఉద్యోగాలు హుష్‌కాకి!

న్యూఢిల్లీ : రానున్న మూడేళ్లలో మూడో వంతు ఉద్యోగాలను యాంత్రీకరించే అవకాశముందని ఓ సర్వేలో వెల్లడైంది. షైన్‌ డాట్‌ కామ్‌ జాబ్‌ పోర్టల్‌ అధ్యయనంలో ఈ విషయం తేలింది. దేశంలోని వివిధ పరిశ్రమల్లో ఈ ప్రభావం ఉంటుందని సర్వే ద్వారా వెల్లడైంది. యాంత్రీకరించే నేపథ్యంలో ఉద్యోగాలపై ప్రభావం పడనుంది. ఈ మేరకు షైన్‌ డాట్‌కామ్‌ మెట్రో నగరాల్లో ఈ సర్వే నిర్వహించింది. ఐటి, విద్య, శిక్షణ, బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఇన్సూరెన్స్‌, మానుఫ్యాక్షరింగ్‌, రిటైల్‌, ఆటో తదితర రంగాలపై సర్వే నిర్వహించారు. ఆయా కంపెనీల హెచ్‌ఆర్‌ ఫ్రొఫెషనల్స్‌ ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. ఇందులో 45.5శాతం మంది హెచ్‌ఆర్‌ ప్రొఫెషనల్స్‌ మాట్లాడుతూ, మున్ముందు మరింత సాంకేతికతపై దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. వచ్చే పర్నెంటు నెలల్లో ఎఐ (కృత్రిమ మేథ), వర్చువల్‌ రియాలిటీ వంటి ఆధునిక టెక్నాలజీ ఆధారిత టూల్స్‌ను ఉపయోగించుకోవాలని ఆలోచిస్తున్నట్లు వారు తెలిపారు. రానున్న రెండు, మూడేళ్లలో తమ సంస్థలో సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయని 36.75శాతం మంది హెచ్‌ఆర్‌ నిపుణులు అభిప్రాయపడ్డారు. పలు రంగాల వ్యాపార కార్యకలాపాల్లో ఎఐ, మెషీన్‌ లెర్నింగ్‌ వంటి ఆధునిక సాంకేతికత వినియోగం పెరుగుతోందని, దీంతో ఉద్యోగాలకు అవసరమయ్యే వృత్తినైపుణ్య స్థాయి పెరుగుతోందని షైన్‌ డాట్‌ కామ్‌ సిఇఒ జైరస్‌ మాస్టర్‌ చెప్పారు. డేటా ప్రైవసీ, సమాచార భద్రత ఆవశ్యకత పెరుగుతున్న నేపథ్యంలో డేటా కంప్లియన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ నిపుణులకూ డిమాండ్‌ పుంజుకుంటోందని తెలిపారు. సాంకేతికంగా పలు మార్పులు వస్తోన్న తరుణంలో కంపెనీలు తమ సిబ్బంది నైపుణ్యం పెంపు లేదా, కొత్త నైపుణ్యాల్లో శిక్షణ ఇప్పించేందుకు ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ ప్లాట్‌ఫామ్‌లతో జతకట్టవచ్చని ఆయన చెప్పారు. టెక్నాలజీ వల్ల సరికొత్త ఉద్యోగాలు పుట్టుకు వస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

https://www.vaartha.com/specials/career/
మరిన్ని తాజా కెరీర్‌  వార్తల కోసం క్లిక్‌ చేయండి :