బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో మరోసారి ఫుడ్ పాయిజన్

బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో మరోసారి విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగింది. గతంలో ఇలాగే ఫుడ్ పాయిజన్ జరిగి వందలమంది హాస్పటల్ లో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి అలాగే జరిగింది. దాదాపు 80మంది విద్యార్థులు భోజనం తిన్న తర్వాత అస్వస్థతకు గురైనట్టు సమాచారం. ఇందులో ఐదుగురు విద్యార్థులకు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. మిగిలిన 75మంది విద్యార్థులకు ప్రాథమిక చికిత్స అందించి హాస్టల్ కు పంపించడం జరిగింది. క్యాంపస్ లోని శక్తి క్యాంటిన్ లో తిన్న విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయినట్లు చెబుతున్నారు.

గతంలో ఓసారి ఎగ్‌ఫ్రైడ్‌ రైస్‌ కలుషితం కావడంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన అధికారులు క్యాంపస్‌లోనే ప్రాథమిక వైద్యం అందించారు. విద్యార్థుల సంఖ్య పెరగడంతో నిర్మల్‌, భైంసా వైద్యులను రప్పించి చికిత్స అందించారు. స్పృహ తప్పి పడిపోయిన కొందరు విద్యార్థులను నిజామాబాద్‌ ఆసుపత్రికి తరలించారు. దాదాపు 200 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు.