అయోధ్య కేసులో కీలక మలుపు

స్థలాన్ని వదులుకోవడానికి 3 షరతులు విధించిన సున్నీ వక్ఫ్ బోర్డు

Ayodhya-Supreme Court
Ayodhya-Supreme Court

న్యూఢిల్లీ: అయోధ్య రామజన్మభూమి బాబ్రీ మసీదు వివాదాస్పద స్థలానికి సంబంధించిన కేసు విచారణను సుప్రీంకోర్టు నిన్న సాయంత్రం ముగించింది. ఈ కేసుకు సంబంధించి వినడానికి ఇంకేమీ లేదంటూ విచారణ ముగింపు సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ప్రస్తుతం తుది తీర్పు మాత్రమే పెండింగ్ లో ఉంది. మరోవైపు, నిన్నటి వాదనల సందర్భంగా కక్షిదారుల్లో ఒకటైన సున్నీ వక్ఫ్ బోర్డు ఓ సంచలన ప్రతిపాదన చేసింది. వివాదాస్పద స్థలంపై తమకున్న హక్కును వదులుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. కానీ, అందుకు మూడు షరతులు విధించింది.

సున్నీ వక్ఫ్ బోర్డు విధించిన షరతులు:


•దేశంలో ఉన్న మసీదులన్నింటికీ రక్షణ కల్పించాలి. 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలి. కబ్జాలు, విధ్వంసాలు జరగకుండా చూడాలి.
•బాబ్రీకి ప్రతిగా అయోధ్యలోనే మరో చోట ఒక పెద్ద మసీదును కట్టుకునేందుకు అనుమతించాలి. అయోధ్యలో ఉన్న 22 పాత మసీదుల మరమ్మతులకు సహకారం అందించాలి.
•పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్న మసీదుల్లో కూడా ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించాలి.

ఈ మేరకు వాదనల చివరి రోజున మధ్యవర్తిత్వ కమిటీ ద్వారా తన ప్రతిపాదనను సుప్రీంకోర్టుకు సున్నీ వక్ఫ్ బోర్డు పంపించింది. ఈ ప్రతిపాదనలపై సున్నీ వక్ఫ్ బోర్డుతో పాటు కొన్ని హిందూ పక్షాలు కూడా సంతకం చేసినట్టు తెలుస్తోంది. ఈ సెటిల్మెంట్ ప్రతిపాదనను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పరిశీలించనుంది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/