లేహ్‌లో అతిపెద్ద జాతీయ ఖాదీ జెండా ఆవిష్కరణ

న్యూఢిల్లీ : ల‌డాఖ్‌లోని లేహ్‌లో నేడు మ‌హాత్మాగాంధీ 152వ జయంతి ఉత్స‌వాల సంద‌ర్భంగా ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఖాదీ జెండాను ఆవిష్క‌రించారు. ల‌డాఖ్ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ ఆర్కే మాథుర్ త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఎగిరేశారు. ఖాదీ నూలుతో త‌యారు చేసిన ఆ జెండా సుమారు 225 ఫీట్ల పొడుగు, 150 ఫీట్ల ఎత్తు ఉన్న‌ది. ఆ జెండా సుమారు వెయ్యి కిలోల బ‌రువు ఉంటుందని అధికారులు చెప్పారు. ఇండియ‌న్ ఆర్మీకి చెందిన 57వ ఇంజినీర్ రెజిమెంట్ ఆ త్రివ‌ర్ణ ప‌తాకాన్ని త‌యారు చేసింది.

ఖాదీ జాతీయ జెండాకు చెందిన వీడియోను కేంద్ర మంత్రి మ‌న్సూక్ మాండ‌వీయ త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు. గాంధీ జ‌యంతి రోజున అతిపెద్ద ఖాదీ తిరంగా ఎగ‌ర‌డం గ‌ర్వంగా ఉంద‌న్నారు. బాపూను స్మ‌రించిన తీరును సెల్యూట్ చేస్తున్న‌ట్లు చెప్పారు. ఇది భార‌తీయ చేనేత క‌ళాకారుల‌ను ప్రోత్స‌హిస్తుంద‌ని, జాతి ఔన‌త్యాన్ని పెంచుతుంద‌ని తెలిపారు. ఖాది అండ్ విలేజ్ ఇండ‌స్ట్రీ క‌మిష‌న్ (కేవీఐసీ) ఈ జెండాను త‌యారు చేసింది. ఖాదీ జాతీయ ప‌తాక ఆవిష్క‌ర‌ణ స‌మ‌యంలో ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ మ‌నోజ్ కుంద్ న‌ర‌వాణే కూడా ఉన్నారు. భార‌త వైమానిక ద‌ళానికి చెందిన హెలికాప్ట‌ర్లు ఈ సంద‌ర్భంగా సెల్యూట్ చేశాయి.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/