ఒమిక్రాన్ సోకిన వ్యక్తి దుబాయ్ పారిపోయాడు..అతడితో ప్రయాణం చేసిన వారి పరిస్థితి ఏంటో..?

corona-new-variant-omicron-presence-in-20-countries

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌..ఇపుడు భారత్ లో అడుగుపెట్టినట్లు కేంద్రం ప్రకటించింది. సౌత్ ఆఫ్రికా నుండి వచ్చిన ఇద్దరికీ ఈ లక్షణాలు ఉన్నట్లు తెలిపింది. ఓమిక్రాన్ వైరస్ సోకినట్లుగా నిర్దారించిన ఇద్దరిలో ఒకరు భారత్ నుండి దుబాయ్ కి పారిపోయాడు.

భారతదేశంలోని మొదటి రెండు కేసులలో ఒకరైన 66 ఏళ్ల వ్యక్తి… నవంబర్ 20 న మన దేశంలో అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఏడు రోజులకే మరో విమానంలో దుబాయ్‌కి వెళ్లిపోయినట్లు అధికారులు తాజాగా సేకరించిన ఆధారాల్లో తేలింది. అతడు ప్రయాణించిన విమానంలో ఉన్న వారి పరిస్థితి ఏంటన్న విషయం అధికారుల్లో గుబులు రేపుతోంది. గత నెల 20న దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన బాధితుడు ఓ హోటల్‌లో దిగాడు. అతడికి నిర్వహించిన కరోనా పరీక్షల్లో కొవిడ్ సోకినట్టు నిర్ధారణ కావడంతో హోటల్‌లోనే స్వీయ నిర్బంధంలో ఉండాలని అధికారులు సూచించారు. అతడు అప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్లు పూర్తి చేసుకున్నట్టు బెంగళూరు మునిసిపల్ అధికారులు తెలిపారు.

బెంగళూరు మునిసిపల్ కార్పొరేషన్ బృహత్ బెంగళూరు మహానగర పాలికే రికార్డుల ప్రకారం ఆ వ్యక్తి దక్షిణాఫ్రికా నుంచి నవంబర్ 20 న బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో కరోనా నెగెటివ్ రిపోర్ట్ తో అడుగుపెట్టాడు. అదే రోజు బెంగళూరులోని ఓ హోటల్లో దిగాడు. ఆ తర్వాత వెంటనే అతనికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. ఓ ప్రభుత్వ వైద్యుడు అతన్ని హోటల్‌ కు వెళ్లి పరీక్షించగా.. అతనికి కరోనా లక్షణాలు లేవని తేలింది. అయితే పాజిటివ్ గా నిర్దారణ కావడంతో సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాలని సూచించి వెళ్లిపోయాడు. ఆ తర్వాత సదరు వ్యక్తి ప్రైవేటు ల్యాబులో చేయించుకున్న పరీక్షల్లో కరోనా లేదని స్పష్టం కావడంతో నవంబరు 27న అర్ధరాత్రి బాధితుడు హోటల్ నుంచి బయటకు వచ్చి క్యాబ్ బుక్ చేసుకుని ఎయిర్‌‌పోర్టుకు వెళ్లాడు. అక్కడ ఫ్లైటెక్కి దుబాయ్ వెళ్లిపోయినట్టు అధికారులు గుర్తించారు.