పెద్దపల్లి టీఆర్ఎస్ సభలో అపశృతి..వృద్ధురాలు మృతి

సోమవారం పెద్దపల్లి లో టిఆర్ఎస్ భారీ సభ ఏర్పటు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ సభలో అపశృతి చోటుచేసుకుంది. కేసీఆర్ సభా ప్రాంగణంలో ఓ వృద్ధురాలు స్పృహ తప్పి పడిపోయి మృతి చెందింది. ఓదెల మండలం నాంసానిపల్లి గ్రామానికి చెందిన మిట్టపల్లి రాజమ్మ(70).. నిన్న టీఆర్ఎస్ సభకు వెళ్లి… అక్కడ స్పృహ తప్పి పడిపోయింది, వెంటనే ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా… అక్కడ పరిస్థితి విషమించి నిన్న రాత్రి మృతి చెందింది. మరి ఈమె కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తుందేమో చూడాలి.

ఇక నిన్న పెద్దపల్లిలో 22 ఎకరాల్లో సుమారు రూ.48 కోట్లతో నిర్మించిన నూతన కలెక్టరేట్ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ..మోడీ సర్కార్ తీరు ఫై నిప్పులు చెరిగారు. 2024లో ఈ దేశం నుంచి బీజేపీని పార‌ద్రోలాల‌ని పిలుపునిచ్చారు. రైతుల‌కు మీట‌ర్ పెట్టాల‌ని అంటున్న ఈ మోదీకే మీట‌ర్ పెట్టాల‌న్నారు. రాబోయే రోజుల్లో దేశం నుండి ఈ బీజేపీని పార‌దోలి రైతుల ప్ర‌భుత్వం రాబోతుంది. ఈ గోల్ మాల్ ప్ర‌ధాన‌మంత్రి, కేంద్ర ప్ర‌భుత్వం ప‌చ్చి అబ‌ద్దాల ఆడుతూ, దేశ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నారు.

దేశంలోని మొత్తం వ్య‌వ‌సాయానికి వాడే క‌రెంట్ కేవ‌లం 20.8 శాతం మాత్ర‌మే. దాని ఖ‌రీదు ఒక ల‌క్షా 45 వేల కోట్లు.ఓ కార్పొరేట్ దొంగ‌కు దోచిపెట్టినంత కాదు క‌దా మోదీ. రైతుల కోసం మీరు బ‌య‌ల్దేరండి అని ఆయా రాష్ట్రాల రైతులు న‌న్ను కోరారు. మీట‌ర్ లేని రైతు రావాల‌ని కోరారు. భార‌త‌దేశం స్వాగ‌తం ప‌లుకుతుంద‌న్నారు. రైతుల‌కు మీట‌ర్ పెట్టాలని అంటున్న‌ మోదీకి మ‌నంద‌రం క‌లిసి మీట‌ర్ పెట్టాలి. ఆ ప‌ని చేస్తే మ‌న‌కు పీడ పోతదని కేసీఆర్ అన్నారు.