దసరా పండగవేళ సామాన్య ప్రజలకు తీపి కబురు తెలిపిన మోడీ

దసరా పండగ వేళ సామాన్య ప్రజలకు తీపి కబురు అందించింది కేంద్రం. మండిపోతున్న వంట నూనె ధరలను తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. 8 నెలల క్రితం 90 రూపాయలు ఉన్న వంట నూనె ప్యాకెట్.. ఇప్పుడు 180 రూపాయలు దాటేసింది. దీంతో సామాన్య ప్రజలు నూనె దగ్గరికి వెళ్లాలంటే భయపడుతున్నారు. ఇక ఇప్పుడు పండగ వేళ వచ్చేసింది. పిండివంటలు చేయాలంటే అంతంత ధరలతో వంట నూనె కొనేసి పిండివంటలు చేయడమే అని మాట్లాడుకుంటున్నారు. ఈ తరుణంలో కేంద్రం ముడి పామాయిల్‌, సోయాబీన్‌, పొద్దుతిరుగుడు నూనెలపై బేసిక్‌ కస్టమ్స్‌ సుంకాన్ని కేంద్రం తొలగించింది. అంతేగాక వీటిపై ఉన్న అగ్రిసెస్‌ను కూడా తగ్గించింది. దీంతో దేశీయంగా వంట నూనె ధరలు కాస్త దిగిరానున్నాయి.

గత కొన్ని రోజులుగా దేశీయ మార్కెట్లో వంట నూనెల ధరలు భగ్గుమంటున్న విషయం తెలిసిందే. ఇక, పండగ సీజన్‌ కావడంతో వినియోగదారులపై మరింత భారం పడనుంది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఊరటనిచ్చేందుకు దిగుమతి సుంకాలను తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. మార్చి 2022 వరకు వీటిపై విధిస్తున్న అగ్రి సెస్ కూడా తొలగించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో వంట నూనె ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు అక్టోబర్ 14 నుంచి మార్చి 31, 2022 వరకు అమల్లోకి తీసుకురావాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.