కామారెడ్డిలో రెస్క్యూ ఆపరేషన్‌ సక్సెస్ : రాజు క్షేమం

కామారెడ్డిలో రెస్క్యూ ఆపరేషన్‌ సక్సెస్ అయ్యింది. బండరాళ్ల మధ్య నుండి రాజు క్షేమంగా బయటపడ్డాడు. సరదాగా అడివిలో షికారుకు వెళదాం అనుకున్న రాజు.. అనుకోని విధంగా బండరాళ్ల మధ్య ఇరుక్కుని రెండు రోజులుగా నరకయాతన అనుభవించాడు. దాదాపు 42 గంటలపాటు నరకయాతన అనుభవించిన రాజును రెస్క్యూ ఆపరేషన్ తో అధికారులు బయటకు తీసుకొచ్చారు. పోలీసులు, అటవీ, రెవెన్యూ, అగ్నిమాపక శాఖల అధికారులు తీవ్రంగా శ్రమించడంతో స్వల్ప గాయాలతో రాజును బయటకు తీసుకురాగలిగారు.

వివరాల్లోకి వెళ్తే..

కామారెడ్డి మండలం రెడ్డిపేటకు చెందిన షాడరాజు మంగళవారం సాయంత్రం మిత్రుడు మహేశ్ తో కలసి సరదాగా వేటకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అయితే కాసేపటికే రాజు చేతిలోని సెల్ ఫోన్ కిందకు జారి బండరాళ్ల మధ్య ఇరక్కుపోయింది. సెల్ ఫోన్ ను తీసే క్రమంలో రాజు బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయాడు. ఓ చేయి, కాలు సహా శరీరం మొత్తం రాళ్ల మధ్య ఇరుక్కుంది. అతడిని బయటకు లాగేందుకు స్నేహితుడు మహేశ్ ట్రై చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. తరువాత మహేశ్ ద్వారా సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని రాజును బయటకు తీసేందుకు ఒక రోజంతా శ్రమించారు. అయినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు విషయం తెలియజేశారు. దీంతో రంగంలోకి దిగిన రక్షక బృందం క్రేన్ ల సహాయంతో బండరాళ్లను తొలగించి రాజును వెలికితీసేందుకు త్వరితగతిన చర్యలు చేపట్టారు. దాదాపు 42 గంటల తర్వాత రాజు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.