అక్టోబర్ లో ఒక్క మునుగోడులోనే రూ. 300 కోట్ల మద్యం అమ్మకాలు

తెలంగాణ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ఎప్పుడు కూడా జోరుగా సాగుతాయనే సంగతి తెలిసిందే. ఈ మద్యం అమ్మకాల ద్వారానే రాష్ట్ర ఖజానాకు భారీగా డబ్బు చేరుతుంది. ఇక సెప్టెంబర్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ శాఖకు మద్యం అమ్మకాల ద్వారా రూ.2700 కోట్లు సమకూరితే.. అక్టోబర్ నెలలో ఈ అమ్మకాలు ఏకంగా రూ.3037 కోట్లకు చేరుకున్నాయి. ఇందులో కేవలం మునుగోడులోనే రూ. 300 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరగటం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే.. ఉపఎన్నికల వేళ మునుగోడులో మద్యం పంపిణీ ఏ విధంగా సాగిందనేది అర్ధం అవుతుంది.

అబ్కారీ శాఖ లెక్కల ప్రకారం అక్టోబర్ 22వ తేదీ వరకే మునుగోడులో రూ.160.8 కోట్ల విలువ చేసే మద్యం అమ్ముడైంది. మిగతా అమ్మకాలు మొత్తం మిగిలిన ఎనిమిది పది రోజుల్లోనే జరిగినట్టు సమాచారం. నల్లొండ జిల్లా మొత్తం మీద ప్రతి నెలా సుమారు రూ.132 కోట్ల మద్యం విక్రయాలు జరిగితే.. ఈ ఉపఎన్నిక వల్ల.. కేవలం మునుగోడులోనే ఏకంగా రూ.300 కోట్ల మేర అమ్మకాలు జరగటం విశేషం.

మునుగోడు ఉప ఎన్నిక దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. వివిధ పార్టీల నాయకులు ఓటర్లను భారీగానే ప్రలోబాలను గురిచేసినట్లు వార్తలు వచ్చాయి. అన్ని పార్టీల నేతలంతా మునుగోడులోనే తిష్టవేసి అక్కడి కార్యకర్తలు, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. బిర్యానీలు, మందు, డబ్బులు ఎందులోనూ తగ్గేదేలే అన్నట్లు నాయకులు వ్యవహరించిన తీరు తెలిసిందే.. ఇదిలా ఉంటే కొంతమంది మునుగోడు ప్రజలు బహిరంగంగానే మాకు మద్యం, డబ్బులు, బిర్యానీలు నాయకుల నుంచి అందినట్లు తెలిపారు. అయితే ఉప ఎన్నికల వేళ మునుగోడులో భారీగా మద్యం అమ్మకం సాగినట్లు అబ్కారీ శాఖ లెక్కలే చెప్పాయి.