రాష్ట్ర మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలి : ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

అమిత్ షా సభ విజయవం కావడంతో టీఆర్ఎస్ నేతలకు కంటి మీద కునుకు లేకుండా అయింది

హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ టీఆర్ఎస్ మంత్రులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభ విజయవంతం కావడంతో టీఆర్ఎస్ నేతలకు కంటి మీద కునుకు లేకుండా అయిందని అన్నారు. ఈ ఫ్రస్టేషన్ లో, ముఖ్యమంత్రి కేసీఆర్ మెప్పుకోసం బీజేపీపై నోటికొచ్చినట్టు పిచ్చి ప్రేలాపనలతో విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీ మొదలుకుని కేంద్ర మంత్రులు, బీజేపీ కీలక నేతలను కించపరుస్తూ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని… నోరు అదుపులో పెట్టుకోకపోతే రాష్ట్ర మంత్రులను తెలంగాణలో తిరగనివ్వబోమని హెచ్చరించారు. వారి తాట తీయడంతో పాటు, వారిని తరిమికొట్టే రోజు దగ్గర్లోనే ఉందని చెప్పారు.

సభలో అమిత్ షా చెప్పినవన్నీ అబద్ధాలేనని అంటున్నారని… ఆయన మాట్లాడిన దాంట్లో ఏది అబద్ధమో చెప్పాలని ప్రభాకర్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలను మోసం చేశారని అన్నారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పడం మొదలు, ఎస్సీలకు 3 ఎకరాలు, దళితబంధు, నిరుద్యోగభృతితో పాలు ఎన్నో హామీలను గాలికొదిలేశారని మండిపడ్డారు. రాష్ట్ర కేబినెట్ లో అత్యంత అవినీతి కేటీఆర్ కు చెందిన మున్సిపల్ శాఖలోనే జరుగుతోందని అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/