పోషకాల రేగు

పండ్లు- ఆరోగ్యం

Regu pandlu

శీతాకాలంలో వచ్చే వాటిలో రేగుపండ్లు ఒకటి. ఈ పండ్లు చిన్నగా ఉంటాయి. రుచిలో మాత్రం తీపి, పులుపు కలగలిసి ఉంటుంది. ప్రస్తుతం చిన్న సైజు ఆపిల్‌లా ఉండి ఆకుపచ్చగా ఉన్న రేగుపండ్లు మార్కెట్‌లో ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఈ పండ్లు రంగు, సైజుని బట్టి 400 రకాలుగాపైగా ఉంటాయి. వీటిలో షుగర్‌కేన్‌, లి, షెర్‌వ్ఞడ్‌, చికొ, హనీజార్‌ వంటి రకాలు తినడానికి బాగుంటాయి. కాస్త ఎండిన తర్వాత తినేవి లాంగ్‌, షాంక్సిలిరకాలు.

గుండ్రంగా, కోలగా పెద్దసైజులో ఉండే రేగు పండ్లను చైనా, వియత్నాం, కొరియా దేశాల్లో బాగా పండిస్తారు. అందుకే వీటిని చైనా ఆపిల్‌, రెడ్‌ డేట్స్‌ అని పిలుస్తారు. పెద్ద సైజులోఉండి తియ్యగా ఉండే తైవాన్‌ రకం మనదేశంలోను పండిస్తున్నారు.

కాండాలకు ముల్లుగా ఉండి పెద్ద పొదలా పెరుగుతుంది. రేగు చెట్టు ఎక్కడైనా పెరుగుతుంది. అందుకే దీన్ని పేదవాడి ఆపిల్‌ అని పిలుస్తారు. పురాణాల్లో రేగుపండుకు ఒక ప్రత్యేక స్థానం ఉందంటే ఆశ్చర్యం కలుగమానదు.

ఉత్తరభారతంలోని గడ్వాల్‌ అనే ప్రాంతంలో విష్ణుమూర్తి తపస్సుచేస్తుండగా ఆయనకు నీడనిచ్చి దాహం తీర్చేందుకు లక్ష్మీదేవి బదరీ చెట్టుగా వెలసిందని, ఆ ప్రదేశమే బదరీవనంగా మారిందని, అక్కడ వెలసిన విష్ణుమూర్తిని బదరీనాథుడిగా కొలుస్తున్నారు. అదే బద్రీనాథ్‌ క్షేత్ర మని పురాథ కథనం. తెలుగువారి సంక్రాంతి పండుగనాడు పిల్లలకు భోగిపళ్లు పోస్తారు.

అవి కూడా రేగుపళ్లతోనే అంటే రేగుపళ్లను భోగిపళ్లు అని కూడా అంటారు. శివరాత్రినాడు శివ్ఞడికి రేగుపళ్లను నైవేద్యంగా పెడుతుంటారు. భక్తశబరి రాముడికి ఎంగిలి చేసి ఇచ్చింది కూడా రేగుపండే. ఇంత చిన్న రేగుపండుకు అంతటి విశిష్టత ఉందంటే ఆశ్చర్యమే మరి. రేగుపండును హిందీలో బేరిఫల్‌ అంటారు.ఒకప్పుడు ఢిల్లీలో రేగుచెట్ల వనం ఉండేదట.

ఇప్పుడు చెట్లు లేవ్ఞ కాని, అక్కడు రేగుపండ్లు మాత్రం అమ్ముతుంటారు. ఆపిల్స్‌, ఖర్జూరాల్లోని పోషకాలన్ని రేగుపండ్లులో దొరుకుతాయి. ఈ పండ్లలో సి విటమిన్‌ మిగతా పండ్లకన్నా 20శాతం ఎక్కువ. ఈ పండ్లలో ఎనిమిది రకాల ఫ్లేవనాయిడ్స్‌ ఉంటాయి. ఇవి ఎన్నో రకాల వ్యాధుల్ని నివారిస్తాయి.

రేగుపండ్లు తింటే కడుపులోమంట తగ్గుతుంది. వీటి రసం గొంతులో మంట తగ్గిస్తుంది. ఈ పండ్లు ఆకలిని తగ్గిస్తాయి. అందుకే బదరీఫలంతో బరువ్ఞ తగ్గించుకోవచ్చు అంటారు. రేగుపండ్లలో సమృద్ధిగా ఉండే ఫాస్ఫరస్‌లు రక్తకణవృద్ధికి తోడ్పడి రక్తహీనతను తగ్గిస్తాయి. ఈ పండు ఉండే పొటాషియం వల్ల రక్తనాళాలు వ్యాకోచించి బిపి అదుపులో ఉంటుంది. మలబద్ధకానికి మంచి మందు రేగుపండు. రేగుపండ్లలో అధికంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్‌ సి వల్ల చర్మరక్షణకు తోడ్పడతాయి.

ఈ పండ్ల రసం తాగితే సొరియాసిస్‌, ఎగ్జిమా వంటి చర్మవ్యాధులు తగ్గుతాయి. ముఖంమీద ముడతలు, మచ్చలు తగ్గుతాయి. నిద్రలేమి, ఒత్తిడి, ఆందోళన, గొంతునొప్పి, ఆస్తమా, కండరాల నొప్పుల్నీ తగ్గించే గుణాలు ఈ పండ్లలో, వీటి గింజల్లో ఉండటం వల్ల మందుల తయారీలో వీటిని ఉపయోగి స్తారు. రేగుపండ్ల గింజల్ని పొడిచేసి నూనెలో కలిపి రాసుకుంటే కీళ్లనొప్పులు తగ్గుతాయి. ఈ చెట్టు బెరడుని మరిగించిన డికాక్షన్‌ డయేరియాకు మంచి మందుగా పనిచేస్తుంది. చూశారా! అంత చిన్న రేగుపండులో ఎన్ని మంచి గుణాలు ఉన్నాయో. రేగిపండే కదా అనుకోకుండా వాటిని కూడా తినండి.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/