శాయ్‌లో పెరుగుతున్న కీచక పర్వం

న్యూఢిల్లీ: భారత్‌కు మేటి క్రీడాకారులను తీర్చిదిద్దే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్)లో కీచక పర్వాలకు అడ్డాగా మారింది. 24 అసోసియేషన్‌ల సమూహంగా ఉన్న శాయ్.. కీచక కోచ్‌లతో అప్రతిష్ట పాలవుతోంది. సమాచార హక్కు చట్టం కింద వెల్లడించిన విషయాలు చూస్తే విస్మయానికి గురిచేస్తున్నాయి. శాయ్‌లో గత దశాబ్దంలో మొత్తం 45 లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. అయితే అందులో 29 కేసులు జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, వెయిట్‌లిఫ్టింగ్, బాక్సింగ్, రెజ్లింగ్ వంటి క్రీడలకు చెందిన కోచ్‌లపై నమోదయ్యాయి. ఇవి కొన్ని మాత్రమేనని, బయటపడనివి ఇంకా ఎన్నో ఉన్నాయని 2018-19 లో శాయ్ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన నీలమ్ కపూర్ తెలిపారు. తాను బాధ్యతలు స్వీకరించే సమయానికి పెండింగ్‌లో ఉన్న లైంగిక వేధింపుల ఫిర్యాదుల సంఖ్యను చూసి తాను షాక్‌కు గురయ్యానని ఆయన అన్నారు. వాస్తవానికి ఇది చిన్న సంఖ్య మాత్రమే, ఫిర్యాదు చేస్తే ప్రతీకారం తీర్చుకుంటారనే భయం కారణంగా అందరూ ముందుకు రారని ఆయన అన్నారు. ఈ భయానికి కారణం నామ మాత్రపు శిక్షలేనని ఆయన అభిప్రాయపడ్డారు. హిసార్ సెంటర్‌లో ఐదుగురు మైనర్ ట్రైనీలను బలవంతంగా ముద్దు పెట్టుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్న ఓ కోచ్‌పై చర్యలు తీసుకోవడానికి శాయ్‌కు మూడేళ్లు పట్టింది. ఇలాంటి శిక్షల కారణంగా చాలామంది నష్టపోతున్నారు. ఫిర్యాదులను వెంటనే విచారించి చర్యలు తీసుకుంటే బాధితులకు వ్యవస్థపై నమ్మకం కలుగుతోంది అని ఆయన చెప్పుకొచ్చారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/