గోదావరి బాధితులకు ఎన్టీఆర్ ట్రస్టు సాయం..

ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు , వరదలకు చాలామంది నిరాశ్రయులయ్యారు. ఉండేందుకు ఇల్లు లేక ..తినడానికి తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరి ఇబ్బందులను స్వయంగా చూసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వారికి సాయం అందించేందుకు రంగంలోకి దిగాడు. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా బాధితులకు సాయం అందిస్తున్నారు.

కష్ట సమయంలో ప్రజలకు అండగా నిలిచేలా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. వరద బాధిత ప్రాంతాల్లో ఆహారం, త్రాగు నీరు, మందులు సహా ఇతర వస్తువుల్ని సరఫరా చేసే కార్యక్రమం ఇవాళ ప్రారంభించినట్లు ఆమె వెల్లడించారు. అందుకు అవసరమైన మేర సరుకుల్ని ఇప్పటికే ఆయా ప్రాంతాలకు తరలించి అందిస్తున్నామన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ సిబ్బంది సహకారంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో జరుగుతున్న సహాయ కార్యక్రమాల అమలుపై ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి, సీఈవో రాజేంద్రప్రసాద్ సమీక్షించారు.

గోదావరి జిల్లాలు సహా రాష్ట్ర వ్యాప్తంగా వరద ప్రభావిత ప్రాంతాల్లోని సుమారు 8వేల కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, మందులు, పిల్లలకు పాలు అందించామన్నారు. అదే స్ఫూర్తితో మిగిలిన వారికి కూడా సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదన్నదే తమ సిద్దాంతమని భువనేశ్వరి తెలిపారు.