తారకరత్న పార్థివదేహాన్ని చూసి కన్నీటిపర్యంతమైన ఎన్టీఆర్

తారకరత్న ను ఆఖరిసారి చూసి జూ. ఎన్టీఆర్ కన్నీటిపర్యంతమై అయ్యారు. శనివారం రాత్రి తారకరత్న కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత నెలలో ఈయన గుండెపోటుకు గురికావడం తో బెంగుళూర్ లోని నారాయణ హృదయాల హాస్పటల్ కు తరలించారు. అప్పటి నుండి కోమాలోనే ఉండిపోయారు. విదేశీ డాక్టర్స్ సైతం తారకరత్న ఆరోగ్యం కుదుటపడేలా తీవ్రంగా శ్రమించారు కానీ కుదరలేదు. దాదాపు 24 రోజులపాటు చికిత్స అందించారు. కానీ తారకరత్న ను బ్రతికించలేకపోయారు. చివరకు ఫిబ్రవరి 18 మహాశివరాత్రి రోజున కన్నుమూశారు. ఆ తర్వాత బెంగుళూర్ నుండి ఆయన భౌతికాయాన్ని హైదరాబాద్ లోని మోకిలాలోని తారకరత్న నివాసానికి తరలించారు. తారకరత్న ను కడసారి చూసేందుకు సినీ , రాజకీయ ప్రముఖులు, టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి నివాళ్లు అర్పించారు. సోమవారం. ఇంటినుంచి తారకరత్న భౌతికకాయాన్ని ఫిలిం ఛాంబర్ కు అభిమానుల సందర్శనార్థం తీసుకొచ్చారు.

ఈ క్రమంలోనే తమ అన్నయ్య పార్థివ దేహాన్ని చూసేందుకు జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కల్యాణ్ రామ్ లు ఫిల్మ్ చాంబర్ వద్దకు చేరుకున్నారు. తమ సోదరుడిని చూసి కన్నీటిపర్యంతం అయ్యారు. అనంతరం పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. అలాగే తారకరత్న తల్లిదండ్రులు కూడా కొడుకును చివరి చూపు చూసేందుకు చాంబర్‌కు వెళ్లారు. ఆ సమయంలో హృదయవిదారక దృశ్యం అక్కడ ఉన్నవారందరినీ కలచివేసింది. తారకరత్న తల్లి కొడుకును ఆ స్థితిలో చూసి గుండెలవిసేలా రోదించింది. కన్న కొడుకు ఇక లేడని ఆమె విలపించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. వీరే కాకుండా అనేక మంది ప్రముఖులు ఫిల్మ్ ఛాంబర్ కు చేరుకొని నివాళ్లు అర్పించారు. ప్రస్తుతం తారకరత్న అంతిమయాత్ర కొనసాగుతుంది. కాసేపట్లో మహా ప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.