ప్రభాస్‌పై కన్నెర్ర చేస్తున్న ఫ్యాన్స్.. వద్దంటున్న తారక్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. కాగా ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో తన విశ్వరూపాన్ని చూపెట్టేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమా ఇంకా పూర్తి కాకముందే తారక్ తన నెక్ట్స్ చిత్రాలను ఓకే చేస్తూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో తారక్ అభిమానులు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌పై కన్నెర్ర చేస్తున్నారు.

తారక్ ఫ్యాన్స్ ప్రభాస్‌పై కన్నెర్ర చేయడం ఏమిటని అనుకుంటున్నారా? తారక్‌తో ఓ పవర్‌ఫుల్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు కేజీఎఫ్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ గతంలో వెల్లడించాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తారిని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ సినిమాను త్వరలోనే అనౌన్స్ చేస్తారనే సమయంలో, ప్రశాంత్ నీల్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ‘సలార్’ను ప్రభాస్‌తో కలిసి చేస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో తారక్-ప్రశాంత్ నీల్ చిత్రం ఇప్పట్లో రాదనే విషయం తేలిపోయింది. కాగా త్రివిక్రమ్‌తో తారక్ నెక్ట్స్ మూవీ రావడానికి కూడా సమయం పడుతుంది.

ఇలా తమ అభిమాన హీరో తారక్, ప్రశాంత్ నీల్‌తో ప్రాజెక్ట్‌ను రెడీ చేస్తాడని భావించిన నందమూరి ఫ్యాన్స్ ఆశలపై ప్రభాస్ నీళ్లు చల్లాడు. దీంతో వారంతా ప్రశాంత్ నీల్, ప్రభాస్‌లపై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. అటు సలార్ చిత్రానికి వారు ఏమాత్రం మద్దతు ఇవ్వకూడదని వారు సోషల్ మీడియా వేదికగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇక ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ చిత్రాన్ని వీలైనంత త్వరగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.