ఉమామహేశ్వరి పోస్టుమార్టం పూర్తి..ఎల్లుండి అంత్యక్రియలు

ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమామహేశ్వరి సోమవారం మధ్యాహ్నం తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె పోస్టుమార్టం పూర్తి అయ్యింది. ఎల్లుండి ఆమె అంత్యక్రియలు జరపనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

అనారోగ్య సమస్యలతో తన తల్లి ఆత్మహత్యకు పాల్పడినట్టు దీక్షిత తెలిపింది. ఆత్మహత్య సమయంలో ఇంట్లో నలుగురిమే ఉన్నామని, లోపలి నుంచి గడియ పెట్టుకుందని పేర్కొంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఉమా మహేశ్వరి గదిలోకి వెళ్లి తలుపు మూసుకున్నట్టు వివరించింది. భోజన సమయానికి బయటకు రాకపోవడంతో తలుపు తెరిచే ప్రయత్నం చేయగా లోపలి నుంచి బోల్టు పెట్టుకుని ఉందని దీక్షిత తెలిపారు. తలుపులను పగలగొట్టి చూడగా ఉరివేసుకొని ఉన్నట్లు తెలిపింది. ఆమె పెద్ద కుమార్తె విశాల అమెరికా నుంచి రావాల్సి ఉండటంతో అంత్యక్రియలు బుధువారం నిర్వహించనున్నారు.

నందమూరి తారకరామారావుకు మొత్తం 12 మంది సంతానం. వారిలో ఎనిమిది మంది కుమారులు కాగా, నలుగురు కూతుళ్లు. వీళ్లలో ముగ్గురు కుమారులు చనిపోయారు. పెద్ద కుమారుడు రామకృష్ణ ఎన్టీయార్‌ బతికి ఉండగానే చనిపోగా.. మిగతా ఇద్దరు కుమారులు ఎన్టీయార్‌ స్వర్గస్థులైన తర్వాత చనిపోయారు. ఇప్పుడు ఆయన చిన్న కూతురు ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారు దీంతో, ఎన్టీయార్‌ సంతానంలో ముగ్గురు కుమారులు, ఓ కూతురు మరణించారు. ఆయన 12 మంది సంతానంలో మొత్తం నలుగురు చనిపోయారు. దీంతో, ఇప్పుడు ఐదుగురు కుమారులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.