రాజకీయాల ‘దిశ’ మార్చిన ఎన్టీఆర్‌

నేడు ఎన్టీఆర్‌ జయంతి

NT Rama Rao (File)
NT Rama Rao (File)

ఎన్టీఆర్‌ అంటే ఎవరో ఈ భారతదేశంలో వారందరికే కాక ప్రపంచంలోని తెలుగు వారంద రికీ తెలుసు. అంతటి విశిష్ఠమైన, విఖ్యాతమైన వ్యక్తి ఎన్టీరామారావు.

ఆయన జన్మించిన 28మే 1923 నాటినుండి స్వర్గస్తులైన18.1.1996 వరకు ఎన్టీఆర్‌ జీవితం మూడుభాగా లుగా విభజించి విశ్లేషించుకోవచ్చు.

మొదటి దాంట్లో బాల్యం, స్కూలు, కాలేజీ, విద్యార్థిదశ, నాటకా లు ఆడటం, మేనమామ కూతురితో వివాహం, సబ్‌ రిజిస్ట్రారుగా ఉద్యోగం ఉన్నాయి.

చక్కటి ఉద్యోగంతో అలాగే కొనసాగి ఉంటే మనందరికి తెలిసేవారు కాదుకదా. కాని విధి బలియమైంది. ఎన్టీఆర్‌ను విశ్వవిఖ్యాతి చేయదలచి సినిమా రంగం వైపు నడి పించింది.

దానికి కారణం నాటకాలు అనుభవం,అందమైన రూపం, గంభీరమైన గొంతు. 1948లో ఎన్టీఆర్‌ సినీరంగ ప్రవేశం నాటికి చిత్తూరు నాగయ్య, సిహెచ్‌ నారాయణరావు, అప్పుడప్పుడే హీరో గా స్థిరపడుతున్న అక్కినేని నాగేశ్వరరావు ఉన్నారు.

1950లో ఎన్టీఆర్‌ నటించిన నాలుగు సినిమాలు విడుదలైనా కూడా 1951 లో విడుదలైన పాతాళబైరవి తెలుగుచలనచిత్ర రూపురేఖని మార్చి వేసింది.

50వారాలు ఆడడమే కాకుండా హిరోయిజం మొదలైంది. కథ హీరో చుట్టూ తిరగడం, పాటలు ప్రజాదరణ పొందడంతో రామారావుకు పేరొచ్చింది.

ఆ తర్వాత మాయాబజార్‌, భీష్మ, లవకుశ, నర్తనశాల, సీతారామకళ్యాణం లాంటి సినిమాలలో రామారావు నటించిన పాత్రలు అజరామరమైనవి.

కృష్ణుడంటే రాముడంటే ఇలా ఉండాలి. అనేంత భక్తిభావం ప్రేక్షకులలో ఏర్పడి, గుండెలలో స్థానం సంపాదించుకున్నాడు.

ఇక మూడో రంగం అయిన రాజకీయాలలోకి ఎందుకు పోవలసి వచ్చింది. 1982 నాటికి రామారావ్ఞకి 59 ఏళ్లు. అయినా సినీరంగంలో హీరో పాత్రలు వేసి మెప్పిస్తున్నారు.

ప్రేక్షకులలో మంచి ఆదరణ, ఆకర్షణ ఉన్నాయి. అంత డిమాండును వదులుకొని రాజకీయ ప్రవేశం ఎందుకు చేయవలసి వచ్చిందని పరిశీలిస్తే మనకు మూడు కారణాలు తెలుస్తాయి. 1980 ‘సర్ధార్‌ పాపారాయుడు, 1982లో బొబ్బిలి పులి సినిమాలలో నటించారు

. ఈ రెండు అత్యంత ప్రజాదరణ పొందాయి.ఈ రెండింటికి కూడా దర్శకులు దాసరి నారాయణరావే. ఈ రెండింటిలో హీరో ప్రభుత్వం మీద, అధికారుల మీద ప్రజల పక్షాన ఎదురు తిరిగే పాత్రలు. ఆ పాత్ర లలో ఆయన జీవించాడు. ప్రాణంపోశాడు.

రెండు సినిమాల షూటింగ్‌ విరామ సమయాలలో దాసరితో ఎన్టీఆర్‌ అనేవారట ‘మనం ప్రేక్షకుల మూలానే ఇంతవారమైయ్యాం.కోట్లు గడిస్తున్నాం.

ప్రతిఫలంగా వారికేమైనా చేయాలి ఈ విషయాన్ని దాసరి ఎన్నో సందర్భాలలో వెల్లడించారు. అంటే ఎన్టీఆర్‌ మదిలో రాజకీయ ప్రవేశ ఆలోచనకు బీజం పడింది.

ఆ సందర్భంలోనే అని చెప్ప వచ్చు. ఇక రెండవ ప్రేరణ భాషాసంయుక్త రాష్ట్రాల ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి 8.1.1983 నాటికి 26 సంవత్సరాలు రాష్ట్రం కాంగ్రెస్‌ పరిపాలనలో ఉంది.

ఓ సంవ త్సరం రాష్ట్రపతిపాలన అనగా 25 సంవత్సరాల కాలంలో పది మంది ముఖ్యమంత్రులు మారారు పదవి కాలం మొత్తం ఉంటే ఐదుగురే ఉండాలి. వాళ్ల పదవీ కాలం పూర్తి కాకుండా ఎందుకు తొలగించబడ్డారు.

వాళ్లు అవినీతికి పాల్పడినందుకా? రాష్ట్రాభివృద్ధి చేయకపోవడమా లేక ఢిల్లీ అధి ష్టానాన్ని లెక్కచేయకనా? సరి యైన సమాధానం ఇప్పటికీ దొరకదు.

ఢిల్లీ అధిష్టానవర్గం రాష్ట్ర నాయకులను కీలుబొమ్మలు చేసి ఆడించడం ఆయనకు ఉద్రేకాన్ని, ఉద్వేగాన్ని తెప్పించాయి. వీటికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు. ఇక ముచ్చటైన మూడో కారణం. భవనం వెంకట్రాం, రామారావు మంచి స్నేహితులు.

ఫిబ్రవరి 1982లో భవనం ముఖ్యమంత్రిగా నియమించబడ్డారు. ముగ్గురు ఎమ్మెల్సీలను నియమించడానికి పదిమంది పేర్ల జాబి తాతో ఢిల్లీ వెళ్లి ఇందిరాగాంధీకి సమర్పించి అందులో ముఖ్యంగా ఎన్టీఆర్‌ ప్రత్యేకత గురించి చెప్పారు.

అయినాకూడా ఎన్టీఆర్‌పేరును తొలగించింది. ఈ విషయం అక్కడే వదిలేస్తే బాగుండేది.

కాని హైదరాబాద్‌ వచ్చి రామారావుకు చెప్పారు భవనం. కోపంతో ఊగిపోయి తానేంటో చూపించాలని, తెలుగువాడి వేడి,పౌరుషం, ప్రతాపం ఇక చూపించక తప్పదు అనుకున్నాడు. ఫిబ్రవరిలోనే మరో సంఘటన జరిగింది.

ఇందిర కొడుకు సంజయ్ ఆంధ్రప్రదే శ్‌కు సరదా పర్యటనకు వచ్చాడు. అది అధికార పర్యటన అసలే కాదు. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రి వర్గం ఎమ్మెల్యేలు అందరు సంజయ్ కు దాసోహం అయ్యారు.

రాష్ట్ర పర్యటనలో భాగంగా అమరావతి మెట్టు ఎక్కుతూ ఉంటే అనుకోకుండా సంజయ్ ఓ కాలు చెప్పు ఊడిపోయింది. అలాగే పై మెట్టు ఎక్కాడు కూడా. అప్పుడు తానే మెట్టుదిగి చెప్పు తొడు కోవచ్చు.

అలాకాకుండా వెనకనే ఉన్న మన రాష్ట్రానికి సంబంధించిన సాక్షాత్తు కేంద్రమంత్రి చెప్పుతీసుకొని సంజయ్ కు తొడిగించారు. ఈ సంఘటన అప్పట్లో పెద్ద దుమారం లేపింది. ఎన్టీఆర్‌కు తెలిసి ఉద్వేగంతో, ఉద్రేకంతో ఊగిపోయాడు.

ఇక లాభంలేదు, తెలుగు వాడి ఆత్మగౌరవం ఢిల్లీనాయకుల పాదాల చెంత తాకట్టు పెట్టబడిం దనుకొని నడుం బిగించారు.

1982 మార్చి 21న రామకృష్ణ సినిస్టూడియోస్‌లో మొట్ట మొదటిసారిగా రాష్ట్రంలో ఉన్న అన్ని పత్రికల వాళ్లతో సమావేశం ఏర్పాటుచేసి రాజకీయాలలోకి ప్రవేశిస్తున్నానని ప్రకటించాడు.

ఇంకో 8రోజుల తర్వాత అదే స్థలంలో నేను తెలుగువాడను, నాది తెలుగుదేశం పార్టీ, నా పార్టీ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం అని చెప్పారు.

11 ఏప్రిల్‌ 1982న మొట్టమొదటిసారిగా తన రాజకీయ ప్రవేశాన్ని నిజాం కాలేజీ గ్రౌండులో లక్షలాది ప్రజల మధ్యన గర్జించారు.

28మే 1982 ఎన్టీఆర్‌ ఇష్టదైవమైన తిరుపతిలో తన జన్మదినాన్ని పురస్కరించు కొని శంఖారావం పూరించారు. రాష్ట్రం అంత పులకించిపోయింది.

ఎనిమిది నెలల వ్యవధిలో చైతన్యరథంపై రాత్రనక, పగలనక ఊరూర తిరుగుతూ తన ప్రసంగాలచే ఉర్రూతలూగించాడు.

పార్టీ లోకి రమ్మని తనంతట తానుగా ఎవ్వరిని పిలవలేదు.వాళ్ల ఇష్టం తో వస్తానన్న వాళ్లను వద్దనలేదు.

ఆయన పోషించిన పాత్రల వల్ల సినీనటుడుకావున జనాలు చూడటానికి వస్తున్నారుకానీ, ఆయనకు ఓట్లు ఎవ్వరు వేయరని చాలామంది రాజకీయ నాయకులు అన్నా రు.

ముఖానికి రంగులు వేసుకునే వాడికి రాజకీయాలెందుకు అని కొంతమంది ప్రత్యర్థులు విమర్శించారు.

ఏమాత్రం రాజకీయ అనుభవం, వారసత్వం లేని ఎన్టీరామారావు పార్టీని స్థాపించి కేవలం ఎనిమిది నెలల్లోనే 202 ఎమ్మెల్యేలను గెలిపించుకొని అధికారం చేపట్టి ముఖ్యమంత్రి పదవిని అధిష్టించడంతో దేశం, ప్రపంచం ఆశ్చర్యపోయింది.

విజయవాడ నగర నడిబొడ్డున తొమ్మిది మంది ముఖ్యమంత్రులను నిలబెట్టి, తానేంటో తెలుగువాడి పౌరుషం ఎంటో ఇందిరాగాంధీకి చూపించాడు.

ఈ రోజు తెలుగు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు సగం మంది ఎన్టీఆర్‌ పుణ్యమా అని రాజకీయాలలోకి వచ్చినవారే.

  • మునిగంటి శతృఘ్నచారి, (రచయిత: కార్యదర్శి,రాష్ట్రబిసి సంఘం, తెలంగాణ)

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/