కూనో నేషనల్‌ పార్క్‌ నుంచి పారిపోయిన మరో చీతా

భయం అక్కర్లేదంటున్న అధికారులు

Now, cheetah Asha follows boyfriend Oban out of Kuno National Park

భోపాల్‌ః నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతాల్లో ‘ఆశా’ అనే పేరున్న మరో చిరుత కునో నేషనల్ పార్క్ నుంచి తప్పించుకుని పారిపోయింది. విషయం తెలిసిన చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలు భయపడుతున్నారు. అయితే, అలాంటి భయాలేవీ అవసరం లేదని, చిరుతలు జనావాస ప్రాంతాల్లో సంచరించవని చెబుతున్నారు. అయినప్పటికీ బఫర్‌జోన్ పరిధిలోని గ్రామాల ప్రజలు మాత్రం చిరుత భయంతో గడుపుతున్నారు.

నమీబియా నుంచి గతేడాది సెప్టెంబరులో 8 చీతాలు భారత్‌కు వచ్చాయి. ప్రత్యేక బోయింగ్ విమానంలో తీసుకొచ్చిన వీటిని మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా విడిచిపెట్టారు. భారత్‌లో అంతరించి పోయిన జాతుల్లోకి చేరిన చీతాలు 74 సంవత్సరాల తర్వాత మళ్లీ మన దేశంలో అడుగుపెట్టాయి. వీటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇవి నిర్దేశిత ప్రాంతం దాటి బయటకు వెళ్తుండడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది.

ఇటీవల ఒబాన్‌ అనే చిరుత తప్పించుకుంది. దానిని వెతికి పట్టుకున్న అధికారులు తిరిగి పార్క్‌లో వదిలిపెట్టారు. ఇప్పుడు ‘ఆశా’ అనే మరో చిరుత తప్పించుకుంది. ఇది రిజర్వు ఫారెస్టును దాటి వీర్‌పూర్ ప్రాంతంలోని బఫర్‌జోన్‌లోకి వెళ్లి నదుల వెంట సంచరిస్తున్నట్టు గుర్తించారు. దీనిని కూడా సురక్షితంగా పట్టుకుని పార్క్‌కు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 చిరుతల్లో సాషా అనే ఆడ చిరుత అనారోగ్యం కారణంగా గత నెలలో మృతి చెందింది.