పురాతన చర్చిని మళ్లీ నిర్మించి తీరుతాం

notre-dame church
notre-dame church


పారిస్‌: ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 850 ఏళ్ల ప్రసిధ్ద పురాతన చర్చి నోట్రే డామే కేథడ్రల్‌ పునర్మిస్తామని ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ ప్రకటించారు. ఈ ఘటనతో యావత్తు దేశం తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యిందని ఆ దేశ అధ్యక్షుడు తెలిపారు. పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి వచ్చే వరకు అగ్నిమాపక సిబ్బంది పనిచేస్తూనే ఉంటారని మేక్రాన్‌ తెలిపారు. అనేక గంటల పాటు అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా చిన్నపాటి మంటలు ఎగసిపడుతుండడంతో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అలాగే ఫ్రెంచ్‌ బిలియనీర్‌ ఫ్రాంకోయిస్‌ హెన్రీ పినాల్‌ చర్చి పునర్‌నిర్మాణానికి 100 మిలియన్‌ యూరోలు విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆకాశం నుంచి నీటిని చిలకరించి మంటలను అదుపులోకి తేవాలని సలహా ఇచ్చాడు. కాని దీని ద్వారా చర్చి పూర్తిగా నేలమట్టం అయ్యే ప్రమాదం ఉందని భావించిన అగ్నిమాపక అధికారులు ఆ మార్గాన్ని ఎంచుకోలేదు.
చర్చిలో ఆధునీకికరణ పనులు కొనసాగుతున్న సమయంలో ఒక్కసారిగా సోమవారం సాయంత్రం మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో చర్చి పైకప్పు పూర్తిగా ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం గమనార్హం. ఈ కట్టడంతో ఫ్రాన్స్‌ ప్రజలది విడదీయరాని బంధం. ఇంతటి చరిత్ర గల చర్చి ఒక్కసారిగా మంటలకు ఆహుతవుతుండడంతో దేశ ప్రజలంతా తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/