కవి దేవీప్రియ కన్నుమూత..

సిఎం కెసిఆర్‌ సంతాపం

devipriya-passes-away

హైదరాబాద్‌: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు విజేత, ప్రముఖ కవి, సీనియర్ జర్నలిస్టు దేవీప్రియ(71) అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రి చేరి, పరిస్థితి విషమించడంతో ఈ రోజు కన్నుమూశారు. దేవీప్రియ అసలు పేరు షేక్‌ ఖ్వాజా హుస్సేన్‌. దేవీప్రియ పేరుతో రచనలు చేస్తూ అదే పేరుతో ఆయన సుపరిచితుడయ్యారు. పలు పత్రికల్లో ఆయన ‘రన్నింగ్‌ కామెంటరీ’ పేరుతో కవితలు రాసేవారు. అమ్మచెట్టు, గరీబు గీతాలు, నీటిపుట్ట, అరణ్య పురాణం వంటి పలు పుస్తకాలు రచించారు. పలు సినిమాలకు పాటలు కూడా రాశారు.

కాగా, దేవీప్రియ మృతి పట్ల సిఎం కెసిఆర్‌ సంతాపం తెలిపారని సిఎంవో పేర్కొంది. ‘ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ దేవీప్రియ మృతి పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. కవిగా, రచయితగా, కార్టూనిస్టుగా సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు ఆయన ఎంతగానో కృషి చేశారని సిఎం అన్నారు. శ్రీ దేవీప్రియ సాహిత్య ప్రతిభకు ‘గాలి రంగు’ రచన మచ్చుతునక అని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు’ అని తెలంగాణ సిఎంవో ట్వీట్ చేసింది.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/