విఫలమైన ఉత్త‌ర కొరియా నిఘా ఉప‌గ్ర‌హ ప్ర‌యోగం!

North Korea’s spy satellite ‘crashes into sea’

ప్యోంగ్యాంగ్‌: ఉత్త‌ర కొరియా చేప‌ట్టిన తొలి అంత‌రిక్ష ఉప‌గ్ర‌హ ప్ర‌యోగం విఫ‌ల‌మైంది. ఆ స్పై శాటిలైట్ స‌ముద్రంలో కూలింది. మిలిట‌రీ ఉప‌గ్ర‌హం మార్గ‌మ‌ధ్యంలో పేలిన‌ట్లు ఉత్త‌ర కొరియా తెలిపింది. చియోల్లిమా-1 రాకెట్ ద్వారా ఆ శాటిలైట్‌ను ప్ర‌యోగించారు. అయితే అది కొరియా ప‌శ్చిమ స‌ముద్రంలో కూలిన‌ట్లు తెలుస్తోంది. టూ స్టేజ్ ఇంజిన్‌కు చెందిన ఆ రాకెట్‌.. స్టార్ట‌ప్ స‌రిగా తీసుకోలేదు. ఫియాన్‌గాన్ ప్రావిన్సులో ఉన్న సోమే శాటిలైట్ లాంచింగ్ గ్రౌండ్ నుంచి మ‌ల్లిగ్యాంగ్‌-1 శాటిలైట్‌ను ప్ర‌యోగించారు.

కాగా, అమెరికా మిలిట‌రీ కార్య‌క‌లాపాల‌పై నిఘా పెట్టేందుకు జూన్ 11వ తేదీ లోగా ఉప‌గ్ర‌హాన్ని ప్ర‌యోగించ‌నున్న‌ట్లు ఇటీవ‌ల ఉత్త‌ర కొరియా ప్ర‌క‌టించింది. అయితే ఆ ప్ర‌యోగం విఫ‌లం కావ‌డంతో.. త్వ‌ర‌లోనే రెండో లాంచ్ చేప‌ట్ట‌నున్న‌ట్లు ఆ దేశం తెలిపింది. స్పై శాటిలైట్ ప్ర‌యోగం విఫ‌లం కావ‌డంతో.. ద‌క్షిణ కొరియా రాజ‌ధాని సియోల్‌లో ఆందోళ‌న‌లు చెల‌రేగాయి. ఇక జ‌పాన్ కూడా ఒకినావా ప్ర‌జ‌ల‌కు వార్నింగ్ ఇచ్చింది. సియోల్‌లో ఎయిర్ రెయిడ్ సైర‌న్లు మోగ‌డంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. త‌ర‌లింపున‌కు సిద్ధంగా ఉండాల‌ని ప్ర‌జ‌ల‌కు మెసేజ్‌లు వెళ్లాయి. అయితే మ‌రో 20 నిమిషాల త‌ర్వాత ఆ మెసేజ్ అవాస్త‌వం అని తేలింది.