నిజమైన యుద్ధానికి సిద్ధమయ్యేలా సన్నాహాలు ఉండాలిః కిమ్

సైనిక విన్యాసాలు చేపట్టిన ఉత్తర కొరియా

North Korea’s Kim Jong Un Orders Intensified Real War Drills

ప్యోంగ్యాంగ్ : ఉత్తర కొరియా తీరు చూస్తుంటే యుద్ధానికి సన్నద్ధమవుతున్నట్టే కనిపిస్తోంది. ఇప్పటిదాకా ఆయుధ పరీక్షలతో పాశ్చాత్య దేశాలకు హెచ్చరికలు పంపుతున్న ఉత్తర కొరియా దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ తాజాగా యుద్ధ సన్నాహాల పట్ల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నిజమైన యుద్ధం కోసం సైన్యం విన్యాసాలు తీవ్రతరం చేయాలని కిమ్ స్పష్టం చేశారు.

ఉత్తర కొరియా హస్వాంగ్ ఆర్టిలరీ దళం చేపట్టిన విన్యాసాలకు కిమ్ తన రెండో కుమార్తెతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగానే అధికారుల వద్ద యుద్ధం ప్రస్తావన తీసుకువచ్చారు. యుద్ధాన్ని నిరోధించడానికి, యుద్ధంలో పాల్గొనడానికి సైనికులు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. యుద్ధం వస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారో అలాంటి విన్యాసాలతో సన్నాహాలు ముమ్మరం చేయాలని స్పష్టం చేశారు.

కాగా, హస్వాంగ్ ఆర్టిలరీ ఫైరింగ్ యూనిట్ ఒకేసారి 6 క్షిపణి ప్రయోగాలు చేపట్టినట్టు ఉత్తర కొరియా అధికారిక మీడియా సంస్థ కేసీఎన్ఏ వెల్లడించింది. అమెరికా-దక్షిణ కొరియా దేశాలు సంయుక్తంగా ఈ సోమవారం నుంచి భారీ సైనిక విన్యాసాలు చేపట్టనున్నాయి. అందుకు ప్రతిగానే ఉత్తర కొరియా సైనిక విన్యాసాలు చేపట్టినట్టు భావిస్తున్నారు.