హుజురాబాద్‌ ఉప ఎన్నిక బరిలో 30 మంది పోటీ..

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో నామినేషన్ల విత్‌డ్రా గడువు ముగిసింది.. బీజేపీ తరపున నామినేషన్ వేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ సతీమణి ఈటల జమున తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. హూజూారాబాద్ ఎన్నికల్లో 30 మంది పోటీలో ఉన్నారు. నామినేషన్లు ప్రారంభమైన తర్వాత మొత్తంగా 61 మంది నామినేషన్లు దాఖలు చేస్తే ప్రస్తుతం నామినేషన్ల తిరస్కరణ, విత్ డ్రాల అనంతరం 30 మంది చివరగా పోటీకి సిద్ధమయ్యారు. చివరి రోజు 12 మంది తమ నామినేషన్లను విత్ డ్రా చేసుకున్నారు. పోటిలో నిల్చున్న స్వతంత్రులకు సాయంత్రం లోగా గుర్తులు కేటాయించనున్నారు.

కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి ఒంటెల లింగారెడ్డి కూడా నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు.. ఇండిపెండెంట్ అభ్యర్థులు సుమన్ నాయక్, వినోద్ కుమార్, రాజ్ కుమార్, నూర్జహాన్ బేగం, మల్లికార్జున్ తదితరులు కూడా నామినేషన్లు విత్‌డ్రా చేసుకోగా.. ఫైనల్‌గా బైపోల్‌ బరిలో 30 మంది అభ్యర్థులు మిగిలిపోయారు.. ముగ్గురు అభ్యర్థులు ఈటల రాజేందర్‌ (బీజేపీ), గెల్లు శ్రీనివాస్‌ (టీఆర్ఎస్‌), వెంకట్ బల్మూర్ (కాంగ్రెస్‌) ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు కాగా.. ఐదుగురు వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు.. మిగతావారంతా ఇండిపెండెంట్ అభ్యర్థులే. ఎన్నికల్లో రెండు ఈవీఎంలతో ఓటింగ్ నిర్వహించనున్నారు. అయితే రోడ్డు రోలర్, ఆటో గుర్తులపై సందిగ్థం నెలకొంది. గత ఎన్నికల్లో ఈ గుర్తుల వల్ల టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా నష్టపోయింది. రోడ్డు రోలర్, ఆటో గుర్తులు టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తును పోలి ఉండటంతో పోలింగ్ సమయంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని టీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది.