అధ్యక్ష అభ్యర్థుల మధ్య రెండ‌వ డిబేట్ ర‌ద్దు!

అధికారికంగా ప్రకటించిన డిబేట్‌స కమిషన్‌

no-second-debate-between-presidential-candidates

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్‌ ట్రంప్‌, జో బైడెన్‌ల మధ్య అక్టోబరు 15నజరగాల్సిన రెండో డిబేట్‌ రద్దు చేస్తున్నట్లు ‘కమిషన్‌ ఆన్‌ ప్రెసిడెన్షియల్‌ డిబేట్స్‌(సీపీడీ)’ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ ఇద్దరు అభ్యర్థులు తొలి డిబేట్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. ట్రంప్‌, బైడెన్‌ల మధ్య తొలి డిబేట్ సెప్టెంబరు 29న జరిగింది. రెండో డిబేట్ రద్దు కావడంతో ఇక నేరుగా ఇరువురు అక్టోబర్ 22న జరగాల్సిన మూడో డిబేట్ లో పాల్గొననున్నారు. ట్రంప్ కరోనా బారిన పడిన నేపథ్యంలో రెండో డిబేట్ పై ఇటీవల సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే.

ఆ డిబేట్‌ను వర్చువల్‌ పద్ధతిలో జరపాలన్న కమిషన్‌ ఆన్‌ ప్రెసిడెన్షియల్‌ డిబేట్స్‌ ‌ నిర్ణయాన్ని ట్రంప్‌ ఒప్పుకోలేదు. తాను నేరుగా పాల్గొంటానని అన్నారు. బైడెన్‌ మాత్రం వర్చువల్‌ డిబేట్‌కు అంగీకరించారు. అయితే, డిబేట్ లో పాల్గొనే వారి ఆరోగ్యంతో పాటు భద్రతను దృష్టిలో పెట్టుకుని తాము చర్చలను వర్చువల్ పద్ధతిలో నిర్వహించాలనుకున్నామని సీపీడీ తెలిపింది. ఆ డిబేట్‌ వర్చువల్‌గానే జరుగుతుందని స్పష్టం చేసినప్పటికీ, చివరకు తమ నిర్ణయాన్ని మార్చుకుంది. డిబేట్ ను పూర్తిగా రద్దు చేసినట్లు ప్రకటించింది.


తాజా బిజినెస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/